‘తెలంగాణకు హరితహారం’ నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం తన సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో మొక్కలు నాటుతారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక చోట, గజ్వేల్ పట్టణ పరిధిలో రెండు చోట్ల మొక్కలు నాటుతారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో ఒకటి, పట్టణంలో ఇందిరా చౌక్ దగ్గర మరో మొక్కను ముఖ్యమంత్రి నాటుతారు. గజ్వేల్ పరిధిలో ఉన్న ప్రతీ ఇంట్లో, అన్ని రకాల రోడ్లపైనా, ఔటర్ రింగ్ రోడ్డుపైనా, ప్రభుత్వ-ప్రైవేటు విద్యాసంస్థల్లో, ప్రార్థనా మందిరాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేలా ప్రణాళిక సిద్ధంచేశారు. బుధవారం ఉదయం అన్ని ప్రార్థనా మందిరాల్లో సైరన్ మోగించగానే ప్రజలందరూ ఒకేసారి మొక్కలు నాటేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. వివిధ ప్రాంతాల నర్సరీల నుంచి ఎత్తుగా ఎదిగిన ఆరోగ్యవంతమైన మొక్కలను తెప్పించారు. పండ్లు, పూల మొక్కలతో పాటు ఇండ్లలో పెంచడానికి ఇష్టపడే చింత, మామిడి, అల్ల నేరడు, కరివేపాకు, మునగ మొక్కలను తెప్పించారు. సుమారు లక్షా 25వేల మొక్కలను ములుగు, గజ్వేల్ నర్సిరీలతో పాటు కల్పకవనం అర్బన్ పార్కుల్లో అందుబాటులో ఉంచారు. ఇక్కడి నుంచి మొక్కలను పట్టణంలోని వివిధ ప్రాంతాలకు తరలించారు. పట్టణాన్ని 8 క్లస్టర్లుగా విభజించి, ప్రత్యేక అధికారులను నియమించారు. ఒక్కో క్లస్టర్ లో 15వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
దాదాపు లక్షా పాతిక వేల గుంతలు (పిట్స్ ను) మున్సిపాలిటీ పరిధిలో తవ్వించారు. సుమారు 75 వేల పండ్ల మొక్కలు (కొబ్బరి, జామ, దానిమ్మ, మామిడి, అల్లనేరడు), 16 వేల పూల మొక్కలు, పది వేల అటవీ జాతులకు చెందిన మొక్కలను సిద్దం చేశారు. పట్టణ ప్రాంతానికి నీడను, స్వచ్చమైన గాలిని ఇచ్చే ఆకర్షణీయమైన చెట్లతో పాటు, ప్రతీ ఇంటికీ రోజూ ఉపయోగపడే కరివేపాకు, మునగ లాంటి మొక్కలు, ఇళ్ల ముందు, వెనకా ఉన్న ఖాళీ స్థలాల్లో పెంచుకునే పూలు, పండ్ల మొక్కలను కూడా ఇంటింటికీ సరఫరా చేసి, నాటించనున్నారు. మొక్కల రక్షణ కోసం సుమారు 60 వేల ట్రీ గార్డులను కూడా అధికారులు సిద్దం చేశారు. మొక్కలు నాటిన తర్వాత వర్షాల్లో విరామాలు వస్తే నీటి సౌకర్యం అందించేందుకు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటేలా అధికారులు, ప్రజాప్రతినిథులు, విద్యార్థులు, మహిళలను సిద్ధం చేశారు. ప్రతీ ఇంట్లో ప్రతీ కుటుంబ సభ్యుడు ఒక మొక్క చొప్పున నాటేలా ప్రజలను చైతన్య పరిచారు.