విశాఖ నగరంలోని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడాయి. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంటి ముట్టడికి మధ్యాహ్న భోజన కార్మికులు యత్నించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. జీతాలు పెంచడంతోపాటుగా.. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటుపరం చేయొద్దంటూ కార్మికులు ధర్నా చేపట్టారు.
ఈ క్రమంలోనే మంత్రి గంటా ఇంటి ముట్టడికి యత్నించిన కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. మహిళా కార్మికులతో పోలీసులు దారుణంగా వ్యవహరించారు. పోలీసులు తమను బలవంతంగా లాక్కెళ్లారంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా వారంతా నినాదాలు చేశారు.