మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చేసిన వ్యాఖ్యలపై తుని వైసీపీ ఎమ్మెల్యే దాడి శెట్టి రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులను అవమానించిన చంద్రబాబు మాటలు తియ్యగాను, వాస్తవాలు చెప్పిన జగన్ మాటలు చేదుగాను ఆయనకు కనిపిస్తున్నాయా అని రాజా ప్రశ్నించారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని మర్చిపోరాదన్నారు. ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్ వ్యాఖ్యలు చేదుగానూ కనిపిస్తున్నాయా? అని నిలదీశారు.ముద్రగడ ఒక అజెండా పెట్టుకుని వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో తన ఉనికిని కాపాడుకునేందుకు తమ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు.
