హైదరాబాద్ – కరీంనగర్ రాజీవ్ రహదారిని ఆనుకుని ఉన్న షామీర్ పేట చెరువు, దాని పరిసర ప్రాంతాలను మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. చెరువు 365 రోజుల పాటు నీళ్లతో నిండి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని, పర్యాటకుల ఆహ్లాదం, ఆనందం కోసం ఏర్పాట్లు చేయాలని చెప్పారు. నెలరోజుల్లోగా షామీర్ పేటను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక రూపొందించి, పూర్తి నివేదిక అందించాలని చెప్పారు. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం షామీర్ పేట చెరువు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మార్చే అంశంపై టూరిజం డెవలప్మెంట్ ఎండి శ్రీ మనోహర్, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి శ్రీ భూపాల్ రెడ్డి తదితరులతో చర్చించారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే కొండ పోచమ్మ రిజర్వాయర్ ద్వారా షామీర్ పేట చెరువుకు నిత్యం నీళ్లు అందుతాయన్నారు. షామీర్ పేట చెరువు కాలువ ద్వారానే బస్వాపూర్ రిజర్వాయర్ కు నీరు అందుతాయన్నారు. అటు షామీర్ పేట చెరువు, ఇటు కాలువలు నిత్యం నీటితో నిండి ఉంటాయని, దీన్ని పర్యాటక శాఖ అద్భుత అవకాశంగా స్వీకరించాలని చెప్పారు. హైదరాబాద్ నగరానికి అతి సమీపంలో ఉన్నందున పర్యాటకులు ఎక్కువ వస్తారని చెప్పారు. పర్యాటకులు బస చేయడానికి అనువుగా మంచి కాటేజీలు, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, చెరువు, కాలువల వెంట ఆకర్షణీయమైన, పూల చెట్లు పెంచాలని చెప్పారు. ప్రధాన రహదారి, చెరువు కట్ట మధ్య నున్న ప్రాంతాన్ని కూడా సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పారు.

Post Views: 225