తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రి కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే, మరో పక్క కరుణానిధి కోలుకుంటున్నారని ఆయన కుమారుడు, కుమార్తె స్టాలిన్, కనిమొళి కాసేపటి క్రితమే ప్రకటించారు. ఏది నిజం..? ఇది అర్థం కాక చాలా మంది డీఎంకే కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కావేరి ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. కరుణానిధి ఆరోగ్యం విషమించిందని తెలిసి ఇద్దరు డీఎంకే కార్యకర్తలు గుండెపోటుతో చనిపోయారు. మరో కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో చెన్నై నగరమంతటా హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.
తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కావేరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరుణా నిధిని పరామర్శించే అవకాశం ఉన్నట్టు మీడియా చెబుతోంది. కరుణా నిధి హెల్త్ బులిటెన్ వార్త వినగానే సముద్రంలోని ఆటుపోట్ల తరహాలో అభిమానుల్లో అలజడి రేగుతోంది. తమ సంక్షేమ సారధిని కళ్లారా చూడాలని అభిమానుల ఆందోళనను, ఆతృతను కట్టడి చేయడం ఎవరి తరం కావడం లేదు. కనీసం ఆస్పత్రి గేట్లను కూడా మూసివేయడం పోలీసులతరం కావడం లేదు. దీంతో కావేరి ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి.