ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సుధాకర్ అనే చేనేత కార్మిక యువకుడు ఇవాళ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, సుధాకర్ తాను ఆత్మహత్య చేసుకునే ముందు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూలేఖ రాశారు. మృతి చెందిన అతని తల్లిదండ్రులు రామచంద్ర, సరోజనమ్మ మున్సిపల్ శాఖలో కార్మికులుగా పనిచేస్తున్నారు. సుధాకర్ మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇదిలా ఉండగా, ప్రత్యేక హోదా కోసం సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చలించిపోయారు. చేనేత కార్మికుడు సుధాకర్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమన్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాడుదాం.. సాధించుకుందాం. అంతే తప్ప ఆత్మహత్యలకు పాల్పడవద్దని వైఎస్ జగన్ కోరారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య అనే ఆలోచననే రానివ్వొద్దని సూచించారు. సుధాకర్ తల్లిదండ్రులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అలాగే, ఏపీకి ప్రత్యేక హోదాను కోరుతూ గతంలో మునికోటి, బెజవాడ శ్రీనివాసరావు, చేబోలుకు చెందిన దుర్గా ప్రసాద్, నెల్లూరు నగర పరిధిలోగల వేదాయపాలెం సెంటర్‌కు చెందిన లక్ష్మయ్యల బలిదానాలను వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారు ప్రత్యేక హోదా కోసం.. ఆత్మ బలిదానం చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.