ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ ఈ నెల 29న జగ్గంపేటలో జరుగనున్న పార్టీ కీలక సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలతో జగన్ భేటీ అయి పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రతి జిల్లాలో వైసీపీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమన్వయకర్తలకు జగన్ దిశా నిర్దేశం చేయనున్నారు. దీనిలో భాగంగా రీజనల్ కో-ఆర్డినేటర్‌లతో జగన్ విడివిడిగా సమావేశం కానున్నారు. ఈ మేరకు సమావేశ వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం వెల్లడించారు. ఆదివారం యాథావిధిగా ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుందని, పాదయాత్ర అనంతరం కోఆర్డినేటర్ల సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొంటారని రఘురాం తెలిపారు. సమావేశ ప‍్రాంగణానికి వైఎస్సార్ నామకరణం చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సమావేశ ఏర్పాట్లను రఘురాంతో కలిసి తూర్పుగోదావరి జిల్లా అద్యక్షులు కురసాల కన్నబాబు, తుని ఎమ్మెల్యే డి.రాజాలు పరిశీలించారు.
