తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఇందుకు అవసరమైన బీబీ నగర్ స్థలానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బీబీనగర్‌లోని స్థలాన్ని తమకు అప్పగించాలని లేఖ రాసింది. అలాగే పక్కనే ఉన్న 49 ఎకరాల స్థలాన్ని కూడా సేకరించి తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేసింది. రోడ్లు, విద్యత్తు వంటి పలు సదుపాయాలు కల్పించాలని కోరింది. ఈ
మేరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం లేఖ పంపింది.
కేంద్ర బృందం కొద్ది రోజుల క్రితమే బీబీ నగర్ స్థలాన్ని పరిశీలించి వెళ్లింది. అనంతరం తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శాంతికుమారికి ఈ వివరాలు పేర్కొంటూ కేంద్ర పీఎం ఎస్ ఎస్ వై డైరెక్టర్ సంజయ్ రాయ్ లేఖ పంపారు. ఎయిమ్స్ రావడానికి విశేష కృషి చేసిన సీఎం కేసీఆర్, ఎంపిలు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాన మంత్రి, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.