‘జగన్ అనే నేను.. ముఖ్యమంత్రి అయ్యాక 2024 ఎన్నికల నాటికి మద్యం షాపులను లేకుండా చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా..’అని ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. మద్యం బెడదతో పదో తరగతి పిల్లలు సైతం వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చినరాజప్ప చిల్లరగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం 220వ రోజు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. వైఎస్సార్ కలలను నిజం చేస్తానని, నాటి స్వర్ణయుగం మళ్లీ తెస్తానని హామీ ఇచ్చారు. ప్రతి చేనేత ఇంట్లో నాన్నగారి ఫొటోతో పాటు తన ఫొటో కూడా ఉండేలా పాలన సాగిస్తానని భరోసా ఇచ్చారు. ఈ సభలో జగన్ ఇంకా ఏమన్నారంటే..‘పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రజలు నాతో చెప్పిన మాటేమిటంటే, అన్నా.. మా పెద్దాపురానికి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయన పేరు చిన రాజప్ప.. ఈయన ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి.. హోంమంత్రి. కానీ ఇదే నియోజకవర్గంలో గడిచిన నాలుగేళ్లలో అక్షరాల ఆరు హత్యలు జరిగాయని చెబుతున్నారు. ఇదే పెద్దాయన అధికారులకు ఫోన్లు చేసి పక్క పార్టీ వాళ్లకు పెన్షన్లు కూడా ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారన్నా అని వాపోయారు. ఈయన చంద్రబాబుకు వంగి వంగి సలాంలు చేస్తూ.. బాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్న తన సొంత సామాజిక వర్గానికి అండగా నిలవాల్సింది పోయి.. చంద్రబాబు అణచివేతలో తుపాకీలా మారి ఈయనే ఒక ఆయుధం అయ్యారన్నా అని చెబుతున్నారు.
