కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే…. ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించినట్టుగానే ఉంది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి….. టీడీపీపై రెండు విమర్శలు, వైసీపీపై నాలుగు విమర్శలు చేస్తూ పెద్దమనిషి అనిపించుకోవాలని పవన్ కల్యాణ్ ప్రయత్నించారు. కానీ నాలుగేళ్లుగా పవన్ కల్యాణ్ విషయంలో వైసీపీ కాస్త సంయమనమే పాటిస్తూ వచ్చింది. పవన్ కల్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన ముసుగును పూర్తిగా తొలగించకుండానే వ్యవహారం నడిపారు.
కానీ తాజాగా ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ కల్యాణ్ భవిష్యత్తు అభిమతం ఏంటో తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో దేశంలోనే అగ్రగామిగా నిలబడిందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నా దాని గురించి మాట్లాడని పవన్ కల్యాణ్… ఎనిమిదేళ్ల క్రితం వైఎస్ హయాంలో అవినీతి జరిగిందని చెప్పడం బట్టే ఆయన వైఖరేంటో స్పష్టమైంది. పైగా తన టార్గెట్ వైసీపీయేనన్న విషయాన్ని మరో రెండు అంశాల ద్వారా బహిరంగమయ్యేలా పవన్ కల్యాణ్ చేశారు. తండ్రి సీఎం కాబట్టి కుమారుడు కూడా సీఎం కావాలనుకోవడం నీచం అంటూ సందర్భం కాకపోయినా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం ద్వారా జగన్‌పై నేరుగా విమర్శలు చేశారు.
నిజానికి వైఎస్ చనిపోయిన వెంటనే జగన్ సీఎం అయి ఉంటే పవన్ కల్యాణ్ విమర్శ సహేతుకంగా ఉండేది. కానీ తన తండ్రి చనిపోయిన తర్వాత సొంతంగా పార్టీ పెట్టారు జగన్. 2014లో ఓడిపోయినా సరే అన్ని పరిస్థితులకు ఎదురొడ్డి పార్టీని నడుపుతున్నారు. కాబ్టటి జగన్ భవిష్యత్తులో సీఎం అయినా అది వారసత్వ పదవి అని చెప్పడం తప్పుడు విమర్శే అవుతుంది. పైగా చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చిన పవన్‌కు వారసత్వం గురించి మాట్లాడే అర్హత అల్పంగానే ఉంటుంది. వైసీపీ ఏదైనా కార్యక్రమం చేస్తే దాన్ని దారి మళ్లించి చంద్రబాబుకు మేలు చేయడానికే పవన్ వస్తారన్నది చాలా కాలంగా ఉన్న విమర్శ. అది మరోసారి స్పష్టంగా రుజువైంది.
నిజానికి పోలవరం ప్రాజెక్ట్ సందర్శన పవన్ కల్యాణ్ షెడ్యూల్‌లో లేదని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్ట్ సందర్శన గురించి పది రోజుల క్రితమే వైసీపీ ప్రకటన చేసింది. ఈరోజు వైసీపీ బృందం పోలవరం వద్దకు వస్తోందని వెంటనే పవన్ కల్యాణ్ అక్కడ వాలిపోయి… పోలవరంపై ప్రతిపక్ష పార్టీకి క్రెడిట్ దక్కకుండా చేయాలని ప్రయత్నించారు. ఒక పార్టీ ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే అదే తరహా కార్యక్రమం, అదే రోజు, అదే ప్రదేశంలో మరో రాజకీయ పార్టీ చేయడం అన్నది ఇప్పటి వరకు చాలా అరుదు. కానీ పవన్ మాత్రం వైసీపీ నేతలతో పోటీ యాత్రకు సిద్ధపడడం ద్వారా తాను టీడీపీకి మిత్రుడినేనని పరోక్షంగా తెలియజేశారు.
పైగా చంద్రబాబు దెబ్బకు అన్ని వ్యవస్థలు, ప్రజలు అహో లక్ష్మణా అని గావు కేకలు వేస్తుంటే… ఇప్పటికీ రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం ఎంతో అవసరమని పవన్ కల్యాణ్ చెప్పారంటే ఆయన జనసేన నేతనా లేక టీడీపీ నేతనా అన్న అనుమానం రాకమానదు. అయితే పవన్ కల్యాణ్ తాజా పర్యటన ఒక విధంగా వైసీపీకి మంచే చేసింది. ముసుగు వీరుడు పవన్ కల్యాణ్ కూడా తమకు ప్రత్యర్థే అన్న విషయం ఇప్పుడు వైసీపీకి స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే ఎన్నడూ లేని విధంగా పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు విరుచుకుపడడం మొదలుపెట్టారు. ఇప్పుడు వైసీపీ పవన్ కల్యాణ్‌పై సరైన లైన్ తీసుకుందనే భావించాలి. ఎందుకంటే పవన్ కల్యాణ్‌పై సంయమనం వల్ల వైసీపీకి నష్టమే తప్ప లాభం లేదు.
చంద్రబాబు తాజా ఆశ.. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును పవన్ కల్యాణ్ చీల్చాలన్నది . కానీ పవన్ కల్యాణ్, చంద్రబాబు ఒకటే అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వైసీపీ చెప్పగలిగితే.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కల్యాణ్‌కు వెళ్లే అవకాశం ఉండదు. ఒకవేళ పవన్‌ను విమర్శించడం వల్ల ఆయన అభిమానులు వైసీపీకి ఓటేయరేమోనన్న భయం అక్కర్లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం అవసరమంటూ మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా… కేవలం వైసీపీ కంటే ఒకటిన్నర శాతం ఓట్లు మాత్రమే ఎక్కువగా తెచ్చుకోగలిగారు. ఇప్పుడు చంద్రబాబు విడివిడిగా వచ్చినా, కలిసి వచ్చినా కొత్తగా వచ్చే ఇబ్బంది వైసీపీకి ఏమీ ఉండదు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య బంధాన్ని ఎంత బలంగా ప్రజలకు చేరవేస్తే వైసీపీకి అంత లాభం ఉంటుంది. (Source Article)…!