ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ను పాటించాల్సిందిగా ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయిస్తోంది. పలువురు నాయకులను గృహనిర్బంధంలో ఉంచింది.
ఈ సందర్భంగా పుత్తూరులో ర్యాలీ చేపట్టేందుకు వచ్చిన నగరి ఎమ్మెల్యే రోజాను బైపాస్ రోడ్‌లో పోలీసులు ఆదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసనకు దిగేందుకు సిద్ధంగా ఉన్న గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే కె.నారాయణ స్వామిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ శాంతియుతంగా ధర్నాలు, ర్యాలీలు చేస్తున్న వైసీపీ నాయకులను అరెస్ట్ చేయటం దారుణమన్నారు. ఉద్యమాన్ని అణచి వేసేందుకు పోలీసులతో తమపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారంటూ మండిపడ్డారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచమైన చర్య అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు
లేదన్నారు. ఢిల్లీలో బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. అవినీతిలో టీడీపీ కూరుకు పోయిందన్నారు.వైసీపీ బంద్ నేపథ్యంలో చిత్తూరు జిల్లావ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు.