వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జన ప్రగతే ధ్యేయంగా.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్‌కు బాసటగా తామున్నామంటూ ప్రజలు నిరూపించుకుంటున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా, జగన్ ఇస్తున్న హామీలపై నమ్మకం పెరుగుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, పాదయాత్ర చేస్తూ జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమావేశాల్లో ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాకినాడ నుంచి వచ్చిన మహిళ జగన్‌తో చంద్రబాబు సర్కార్ చేసిన మోసాన్ని కళ్లకు కట్టినట్టు చెప్పింది.
అన్నా, నేను కాకినాడ నుంచి వచ్చానన్నా అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టిన ఆ మహిళ మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారన్నా.. కానీ, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చంద్రబాబు ప్రభుత్వం మాఫీ చేయలేదన్నా అంటూ వాపోయింది. బ్యాంకులో ఉన్న మా పొదుపు అంతా పోయిందన్నా అంటూ కన్నీరు మున్నీరైంది. మా పొదుపు డబ్బులన్నిటినీ చంద్రబాబు తినేశాడంటూ చాలా ఆవేశంగా తన బాధను జగన్‌తో చెప్పుకుని కన్నీరు మున్నీరైంది. ఈ విషయంపై బ్యాంకు అధికారులను అడిగితే.. రుణం మేమిచ్చామా..? చంద్రబాబు నాయుడు ఇచ్చారా..? అంటూ ప్రశ్నిస్తున్నారని, వారికి సమాధానం చెప్పలేని స్థితిలో తామున్నామంటూ డ్వాక్రా సంఘం మహిళ చెప్పింది.