ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ ఏపీ వ్యాప్తంగా బంద్ విజయవంతంగా కొనసాగుతోంది. మరో పక్క వైఎస్ఆర్‌సీపీ నేతలను, నాయకులను, కార్యకర్తలను చంద్రబాబు సర్కార్ తన అధికార బలంతో పోలీసులను ఉపయోగించి అరెస్టులు చేసి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు కూడా కొంత వివాదాలకు తావిచ్చేలా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బంద్ పిలుపును చంద్రబాబు సర్కార్ నిర్దాక్షిణ్యంగా అణచివేసే ప్రయత్నాలను చేస్తోంది.
మహిళా నేతలు, ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులను కూడా పోలీసులు బలవంతంగా లాక్కెళుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా.. వారిని ఈడ్చుకుంటూ వెళ్లి అరెస్టు చేసి తీసుకెళ్తున్న పరిస్థితి ఏపీ వ్యాప్తంగా కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలువురు లేవనెత్తుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. విభజన హామీల కోసం, అదే విధంగా కేంద్ర సర్కార్ తీరుకు సంబంధించి చంద్రబాబు సర్కార్ ఉద్యమాలు, దీక్షలు చేస్తే దానికి ఒకలాగా, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన బంద్‌ను మరోలా చూస్తోంది. టీడీపీ చేసే బంద్‌లకు, దీక్షలకు ప్రభుత్వ డబ్బును, ప్రభుత్వ సిబ్బందిని వినియోగించుకున్న విషయం తెలిసిందే. కానీ, ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్‌పై మాత్రం ఉక్కుపాదం మోపి అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. ఇలా అనునిత్యం చంద్రబాబు సర్కార్ ప్రత్యేక హోదా ఉద్యమానికి తూట్లు పొడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పోలీసులను మోహరింపచేసి ప్రశాంతంగా బంద్ చేస్తున్న వైఎస్ఆర్‌సీపీ నేతలు కార్యకర్తలను నిర్దాక్షిణ్యంగా అరెస్టులు చేయిస్తోంది.