ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన మోసం.. కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తీరుకు నిరసనగా రాష్ట్ర బంద్‌ను పాటించాల్సిందిగా ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపునకు స్పందించిన పార్టీ శ్రేణులు, ప్రజా సంఘాలు మంగళవారం తెల్లవారుజాము నుంచే బంద్‌లో పాల్గొన్నాయి. వాహనాలు రోడ్డెక్కలేదు. దుకాణాలు తెరుచుకోలేదు. విద్యా సంస్థలు, పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నాయకులను అరెస్ట్ చేయిస్తోంది. పలువురు నాయకులను గృహనిర్బంధంలో ఉంచింది.
కర్నూల్ జిల్లా పత్తికొండ ఆర్టీసీ డిపో నుండి బస్సులు బయటకు రాకుండా నియోజకవర్గ వైసీపీ ఇంచర్జి చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో పార్టీ నేతలు శ్రీరంగడు, బజారప్ప యూత్ యూత్ నాయకులు మధు, ఇమ్రాన్, పార్టీ కార్యకర్తలు డిపో ఎదుట బైఠాయించారు. రాష్ట్ర బంద్ పత్తికొండలో తెల్లవారుఝామున నాలుగు గంటలకే చెరుకులపాడు శ్రీదేవి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వద్దకు చేరుకుని బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. అనంతరం బెంగళూరు -మంత్రాలయం రోడ్డుపై బైఠాయించి లారీలను నిలిపివేశారు. పట్టణంలోని వ్యాపారులు వైసీపీ ఇచ్చిన బంద్ పిలుపుకు సహకరించి తమ దుకాణాలను మూసివేశారు. స్థానిక ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి ప్రదర్శనగా బయలుదేరి వెళుతున్న వైసీపీ శ్రేణులను తేరు బజార్ ప్రాంతంలో పోలీసులు అడ్డుకుని చెరుకులపాడు శ్రీదేవిని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీంతో పత్తికొండలో ఉద్రిక్తత నెలకొంది. ప్రత్యేక హోదా కోసం బంద్ పాటిస్తుంటే అరెస్టులు చేయటం సిగ్గుచేటని శ్రీదేవి నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు ఉద్యమాన్ని అణచి వేయాలని చూడటం నీచమైన చర్య అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబుకు లేదన్నారు. ఢిల్లీలో బీజేపీతో చంద్రబాబు లాలూచీ పడ్డారని ధ్వజమెత్తారు. అవినీతిలో టీడీపీ కూరుకు పోయిందన్నారు.