ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. కాగా, జగన్ చేస్తున్న పాదయాత్ర ఇప్పటి వరకు ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో కొసాగుతోంది. తమ సమస్యలను తెలుసుకుంటూ.. వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ జగన్ చేస్తున్న పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు జగన్‌ను కలుసుకుంటున్నారు. చంద్రాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను జగన్‌కు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధులు అయితే, సీఎం చంద్రబాబు నియమించిన జన్మభూమి కమిటీలు మొన్నటి వరకు తమ పింఛన్ నగదులో కమీషన్లు దండుకున్నారని, నిరుద్యోగులు అయితే, ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా వదల్లేదని, రైతులు, డ్వాక్రా సంఘాల మహిళలైతే, తమకు రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు. .ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మాఫీ చేయలేదని, ఇలా ప్రతీ ఒక్కరు వారి సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు చెప్పుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, సోమవారం 219వ రోజు జగన్ పాదయాత్రలో ఓ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అయితే, జగన్ పాదయాత్ర చేస్తూ ముందుకు సాగుతున్నక్రమంలో ఆ ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులు వారి పిల్లలను తీసుకు వచ్చి వైఎస్ జగన్ చేత అక్షరాభ్యాసం చేయిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జగన్ చేత అక్షరాభ్యాసం చేయించేందుకు ఓ వ్యక్తి తన కుమారుడ్ని తీసుకు వచ్చాడు. అలా ఆ చిన్నపిల్లాడికి అక్షరాభ్యాసం చేయిస్తూ జగన్ చూపించిన హావభావాలు పలువురిని ఆకట్టుకున్నాయి.