శాసన సభ్యురాలు ఉప్పులేటి కల్పన. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున ఎమ్మెల్యేగా గెలుపొందింది.. రెండేళ్ల కిందట అధికార టీడీపీ పార్టీలోకి ఫిరాయించారు. తన నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి కోసం నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫైనాన్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న వాహనాలపై ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన కన్నేశారు.
అయితే, మువ్వ గ్రామానికి చెందిన దగాని క్రాంతి కుమార్ ఎన్ఎస్ఎఫ్‌డీసీ పథకం ద్వారా సబ్సిడీపై దరఖాస్తు చేయగా సుమారు రూ.20 లక్షల విలువైన ఇన్నోవా వాహనాన్ని మంజూరు చేశారు. ఆ వాహనాన్ని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పేరుతో గుడివాడ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ర్టేషన్ చేయించారు. ఈ వాహనానికి ట్యాక్సీ ట్రావెల్స్ కింద నెంబర్‌ను కేటాయించాల్సి ఉంటే.. రవాణాశాఖ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ.. అధికారులపై వచ్చిన ఒత్తిడి వల్ల ఈ వాహనానికి వైట్ ప్లేట్ కేటాయించారు. ఆ తరువాత పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వద్దకు చేరింది. సదరు వాహనంపై దర్జాగా ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని మరీ ఆ కారులో తిరుగుతోంది ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన స్వయంగా సబ్సిడీ వాహనాన్ని ..నిబంధనలకు విరుద్ధంగా.. బినామీ పేరుతో తీసుకోవడాన్ని దళిత సంఘాలు తప్పుబడుతున్నాయి. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ఎమ్మెల్యే నిబంధనలు ఉల్లంఘించడంపై రాజకీయ పక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాల్లో పేద వర్గాలకు ఎన్ఎస్ఎఫ్‌డీసీ పథకం కింద అందించే వాహనాలకు నిధులను పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాలను తామే ఇస్తున్నట్టు వాహనంపై థ్యాంక్యూ సీఎం సర్ పేరుతో స్టిక్కర్లు వేసి పంపిణీ చేస్తున్నారు.