కేటీఆర్..పురపాల శాఖను రీ డిజైన్ చేసిన నాయకుడు. మంత్రి అంటే కేవలం పరిపాలన పేరుతో పత్రికలు, ప్రసార సాధనాల్లో హడావిడి…ప్రజలకు ఆమడ దూరం అనే దానికి ఆయన పూర్తి భిన్నం. ప్రజలతో మమేకం అయ్యేందుకు ఏకంగా “మన నగరం“ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అలా తెలంగాణ పురపాలకశాఖ మంత్రిగా మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీపై తనదైన ముద్ర వేశారు. పారిశుధ్యం, రోడ్లు తదితర విభాగాల్లో సమూల మార్పులు చేశారు. వంద రోజుల ప్రణాళిక పేరుతో వివిధ విభాగాలను పరుగులు పెట్టించారు. ఆకస్మికత తనిఖీలు, విస్తృత పర్యటనలు, సుదీర్ఘ సమావేశాల ద్వారా పనుల్లో వేగం పెంచారు. జీహెచ్‌ఎంసీని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు. కేటీఆర్ ఈ ఏడాది ఫిబ్రవరి 10న రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో గల్లీగల్లీ తిరిగి ప్రజల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించారు. వాటిని పరిష్కరించడంతోపాటు నగరాన్ని విశ్వనగరం వైపు నడిపేందుకు తనదైన శైలిలో కృషిచేస్తున్నారు.
పురపాలక మంత్రిగా మంత్రి కేటీఆర్ జీహెచ్‌ఎంసీలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా పరిశుభ్ర, సుందర నగరంగా, రోడ్లపై గుంతలు లేని సిటీగా తీర్చిదిద్దేందుకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. 6 గంటలకే మున్సిపల్ అధికారులంతా రోడ్లపైకి వచ్చి పారిశుధ్య పనులను పర్యవేక్షించడంతోపాటు క్షేత్రస్థాయిలో సమస్యలను తెలుసుకునేందుకు కృషిచేయాలని ఆదేశించారు. చెత్త కుప్పలతో సమస్యాత్మకంగా తయారైన దాదాపు 200ప్రాంతాలను అందంగా తీర్చిదిద్దారు. ఘన వ్యర్థాల నిర్వహణ పథకానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తడి-పొడి చెత్త సేకరణ, ఇంటి చెత్త సేకరణ నిర్వహించే దిశగా చర్యలు చేపట్టారు.
రోడ్లు పాడుకాకుండా..
రోడ్లపై గుంతలు కనిపించకుండా ఉండేందుకు రోడ్డు డాక్టర్ యంత్రాలతోపాటు ఇన్‌స్టంట్ రిపేర్ టీంలను రంగంలోకి దింపారు. గుంతలపై ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని పూడ్చేలా చర్యలు చేపట్టారు. అంతేకాదు, రోడ్ల సమస్యను శాశ్వతంగా పరిష్కరించే ఉద్ధేశంతో దాదాపు 1000కిలో మీటర్ల మేర వైట్ టాపింగ్ రోడ్లను ఏర్పాటుచేయాలని సంకల్పించారు. ఈ దిశగా అవసరమైన చర్యలు ప్రారంభించారు. అలాగే, రోడ్ల నిర్వహణను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించాలని నిర్ణయించి ధర నిర్దారణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న నాలుగు కబేళాలను త్వరితగతిన పూర్తిచేయించి వాటిని ప్రారంభించారు.
పనులు వేగవంతం చేసేందుకు…
వంద రోజుల ప్రణాళిక పేరుతో ఉదాశీనంగా ఉన్న ఆయా ప్రభుత్వ విభాగాలను తట్టిలేపి లక్ష్య నిర్ధారణ చేశారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీలో ఎంతోకాలంగా కొనసాగుతున్న మార్కెట్లు, బస్‌బేలు, బహుళ ప్రయోజనకర హాళ్లు తదితరవాటి నిర్మాణాన్ని వేగవంతం చేశారు. పనులను వేగవంతం చేయడం, పారదర్శక పాలనను అందించేందుకు ఆన్‌లైన్ సేవలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక యాప్ రూపకల్పనకు కృషిచేశారు.
సోషల్ మీడియా, మేధోమథనం, దిశానిర్దేశం…
ఇవన్నీ ఒక ఎత్తైతే, అధికారులతో సుదీర్ఘంగా మేధోమథనం నిర్వహించి మెరుగైన పాలనకోసం వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. మున్సిపల్ శాఖ చేపట్టిన తరువాత పలుదఫాల్లో ఆయా ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకోవడంతోపాటు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలను వారికి సూచించారు. ముఖ్యంగా ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటిని ఎప్పటికప్పుడు అధికారులకు చేరవేస్తున్నారు.
హెచ్‌ఎండీఏ ప్రక్షాళనలో..
హెచ్‌ఎండీఏ ప్రక్షాళనలో మంత్రి కేటీఆర్ తనదైన పాత్ర పోషించారు. బాధ్యతలు స్వీకరించిన తొలి రోజుల్లోనే సంస్థ బీపీపీ కార్యాలయంలో రోజంతా ఆయా శాఖల అధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలని సూచించారు. దీంతో పాటు అవినీతిరహిత సేవలకు శ్రీకారం చుట్టడంతో పాటు అధికారుల్లో జవాబుదారీతనాన్ని పెంచారు. అంతేకాదు 100 రోజుల పథకంలో ఏడు అంశాలను నిర్ధేశిత లక్ష్యంలోపే పూర్తి చేశారు. ఇందులో ప్రధానమైన ఘట్‌కేసర్-శామీర్‌పేట 21.3కి.మీ ఔటర్ మార్గాన్ని ప్రారంభించి ఔటర్‌లో అడ్డంకులు లేని ప్రయాణాన్ని అందించారు. ఇక ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టు, రీజినల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన దశలో ఉండగా, ఔటర్‌లో సాఫీగా ప్రయాణానికి గానూ ఎల్‌ఈడీ లైటింగ్, హెచ్‌టీఎంఎస్, ఐటీఎస్, సిటీ ఐటీఎస్, టీఎంఎస్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించబోతున్నారు.