వారిది దశాబ్దాల వలస బతుకు. తాతల కాలం నుంచి ప్రతి కుటుంబం పని కోసం వెతుకులాటే. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు వలస బాట పట్టాల్సిందే. తండ్రి అక్కడ.. తల్లి ఇక్కడ. భార్య ఇక్కడ భర్త అక్కడ. కన్న పిల్లలను చూసుకోలేని.. తల్లిదండ్రుల కడచూపునకు నోచుకోని బతుకు. అలా 40 ఏండ్లు సూరత్, భీవండి, షోలాపూర్, ముంబైల్లో నరకం చవిచూసిన జీవితాలు.
ఎప్పుడెప్పుడు సొంతూరుకొస్తామా అని ఎదురుచూసిన బతుకువారిది. ఎప్పటికైనా పాలకులు సాయం చేస్తారనుకున్నా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నంతవరకు ఆశలు అడియాసలయ్యాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలు, ఇచ్చిన హామీలు వలస బాట తిరోగమనమైంది. మనసు చంపుకొని వలసవెళ్లి బతుకు వెళ్లదీస్తున్న కార్మికులకు మార్గం చూపింది. సొంతూరుకొచ్చేటట్టు చేసి కుటుంబ సభ్యులను కలిపింది. అన్నింటికీ మించి అక్కడ సేట్ల వద్ద బిక్కుబిక్కుమంటూ పని చేసిన బతుకుల్లో మార్పును తీసుకొచ్చింది. ఇక్కడికొచ్చి ప్రభుత్వ సాయమందుకొని యజమానులయ్యారు. అప్పుల తిప్పలు, ఆకలి చావులతో ఉరితాళ్లు పేనిన సిరిసిల్ల నేతన్నకు ఊపిరి పోసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మంత్రి కేటీఆర్ తీసుకున్న చర్యలు ఫలించాయి.
నాటి సమైక్య ఏలికల నిర్లక్ష్యం వస్త్ర పరిశ్రమకు పెను శాపంగా మారింది. ఎందరో మర నేతన్నల ఆత్మహత్యలకు దారి తీసింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందల సంఖ్యలో బలవన్మరణాలకు పాల్పడ్డారు. సాంచాలలో ఎప్పుడు చావు కేకలు వినిపించేవి. నూలు పోగులనే ఉరితాళ్లుగా చేసుకుని కార్మికులు తనువు చాలించేవాళ్లు. దేశంలో రెండో షోలాపూర్‌గా ప్రసిద్ధి గాంచిన సిరిసిల్ల ఆంధ్రా పాలకుల సవతి ప్రేమతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. స్వరాష్ట్రం సిద్ధించాక, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన సంక్షేమ పథకాలతో చేనేత పరిశ్రమ జవజీవాలను సంతరించుకున్నది. ఇక్కడి పరిశ్రమను, కార్మికుల జీవన స్థితిగతులను అధ్యయనం చేసిన మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేత కార్మికుల ఉపాధికి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు. కార్మికుల ఆర్థిక పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్న సంకల్పంతో ఒక్కొక్క పథకం అమలు చేస్తూ వచ్చారు. కార్మికుడు బాగు పడాలంటే సాంచాలు మంచిగ నడవాలి. వాటితో పాటు యజమానులకు చక్కని మౌలిక వసతులు కల్పించాలన్న ఆలోచన చేశారు.
మరమగ్గాలకు యాభై శాతం విద్యుత్ రాయితీలు, పాత సాంచాలను ఆధునికీకరించి నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు తయారు చేస్తే కార్మికుల వేతనాలు పెరుగుతాయని భావించారు. చేతి రుమాలు నుంచి వివాహ వస్ర్తాల వరకూ ఇక్కడే తయారు చేయాలన్న సంకల్పంతో ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నెలకు కనీసం రూ.15 వేల నుంచి రూ. 20 వేల వేతనం వస్తేనే కుటుంబం పొట్ట గడవని స్థితికి చేరింది. దీనిపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులకు చేతినిండా పని కల్పించే దిశగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే ఏకరూప దుస్తుల తయారీ, బతుకమ్మ చీరల ఆర్డర్లతో పాటు అన్ని వస్త్ర ఉత్పత్తులు సిరిసిల్లకే ఇస్తామని ప్రకటించారు. దీంతో మరమగ్గాల కార్మికుల కుటుంబాల్లో సంతోషం వ్యక్త మవుతున్నది.
వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు రూ.800 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం నేతన్నల్లో భరోసా నింపింది. పన్నెండు గంటల పాటు పని చేస్తున్న కార్మికులకు రూ.15నుంచి రూ.20వేలు కూలీ వచ్చేలా తెలంగాణ సర్కారు చర్యలు తీసుకోవడం, బీడీలతో ఆరోగ్యాలు పాడవుతున్న మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించడం కోసం
రూ.30 కోట్లతో అపెరల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో కార్మికక్షేత్రాల్లో పండుగవాతావరణం నెలకొంది.
“ఎక్కడికో పోయే కంటే ఇక్కడే అందరం కలిసి ఉందామంటూ నా భార్య, పిల్లలు పట్టుబట్టిండ్రు. ఇప్పుడు బొంబాయి, భీవండీ, సూరతోళ్లు ఇక్కడికే వత్తున్నరు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల కడుపు సల్లంగుండా మా కుటుంబాల్లో వెలుగులు నింపిండ్రు.“ ఇది మరమగ్గాల కార్మికుల మాటలు. ఇలా చెప్పేది ఏ ఒక్కడో ఇద్దరో కాదు.. కార్మిక క్షేత్రం సిరిసిల్లలో ఇప్పుడు ఏ నేత కార్మికుడిని కదిలించిన ఇదే సమాధానం వస్తున్నది. టీఆర్‌ఎస్ సర్కారు చేపట్టిన ఎన్నో కార్యక్రమాలతో వలస వెళ్లిన వేలాది మంది చేనేత కార్మికులు తిరిగి సొంత ప్రాంతాలకు వస్తున్నారు.