కాంగ్రెస్ పార్టీ తీరుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ మరోసారి తెలంగాణపై కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని సీడబ్ల్యూసీ తీర్మానం చేయడం తెలంగాణకు ద్రోహం చేయడమేనని ఆయన మండిపడ్డారు. “నష్టపోయినందుకే తెలంగాణకు రాష్ట్రం ఇచ్చారా. లాభపడ్డందుకు ఇచ్చారా? లాభపడ్డ ప్రాంతానికే మళ్ళీ ప్రత్యేక హోదా పేరిట లాభం చేస్తారా ? తెలంగాణకు అన్యాయం చేసే తీర్మానాన్ని ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఎందుకు స్పందించరు?“ అని ఆయన సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ నేతలకు పదవుల ధ్యాసే తప్ప మరొకటి లేదని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారం కోసం గుంటనక్కలా ఎదురు చూస్తోంది కాంగ్రెస్ నేతలేనని ఆయన అన్నారు. “కాంగ్రెస్ ఎపుడూ తెలంగాణకు అన్యాయం చేసే పార్టీయే. అమరవీరుల త్యాగంతోనే తెలంగాణ వచ్చింది ..కాంగ్రెస్ వల్ల రాలేదు. కాంగ్రెస్ నేతలది సీట్ల దందానే తప్ప ..ప్రజల సంక్షేమ ధ్యాస కాదు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోర్లు మూసుకుని కూర్చున్నారు“ అని అన్నారు. కాంగ్రెస్ సర్వేలోనే వారికి మూడు సీట్లు కూడా రావని తేలిందని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఏపీలో అధికార పార్టీతో చెట్టాపట్టాల్ వేసుకు తిరుగుతూ పోరాటాలు చేయకుండా ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అనవసర విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఏం చేసినా తెలంగాణలో మళ్ళీ అధికారం టీఆర్ఎస్ పార్టీదే అధికారమని ఆయన స్పష్టం చేశారు.