వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో 219వ రోజు దిగ్విజయంగా కొనసాగుతోంది. జన ప్రభంజనం మద్య వైఎస్ జగన్ తన పాదయాత్రను కొనసాగిస్తూ.. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. మరో పక్క వైఎస్ జగన్ పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి చేయాలని వేదపండితులు అనేక యాగాలు, యజ్ఞాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే, వైఎస్ జగన్ లాంటి దమ్మున్న నాయకుడు ఏపీకి ముఖ్యమంత్రి కావాలని ఏడాది పాటు యాగాలు, యజ్ఞాలు చేస్తున్న వేద పండితులు.. పాదయాత్ర చేస్తున్న జగన్‌ను కలిశారు.
ఈ సందర్భంగా వేద పండితులు మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలంటూ హైదరాబాద్ నగర వేదికగా శ్రీ మహారుద్ర సహిత సహస్ర చంఢీయాగం నిర్వహిస్తున్నామని, యాగం చేపట్టి ఈ నెల 29వ తేదీకి సంవత్సరం పూర్తి అవుతుందన్నారు. ఈ క్రమంలోనే వైఎస్ జగన్‌ను కలిసి ఆశీర్వచనాలు తెలిపామని వేదపండితులు చెప్పారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుపొంది..వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని, జగన్ ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పట్నుంచి ఏపీ ప్రజల మొఖాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని వేద పండితులు చెప్పారు.