సరైన పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని రోజు నిర్ణీత సమయానికి తీసుకోవడం, నిత్యం వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం వంటి పనులతో ఎవరైనా అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. నేటి తరుణంలో అధిక బరువుతో బాధపడుతున్న చాలా మంది ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని పాటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం పలు పొరపాట్లను చేస్తుండడం వల్ల బరువు తగ్గలేకపోతున్నారు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. కొందరు అధిక బరువు త్వరగా తగ్గవచ్చు కదా అని చెప్పి వ్యాయామం చేసి కూడా ఆహారం సరిగ్గా తీసుకోరు. దీని వల్ల బరువు ఎక్కువగా తగ్గవచ్చని వారనుకుంటారు. కానీ ఇలాంటి పొరపాటు చేయరాదు. వ్యాయామం చేసే వారు ఆహారం కూడా సరిగ్గా తీసుకోవాలి. రోజూ తాము చేసే పనిని బట్టి ఎన్ని క్యాలరీలనిచ్చే ఆహారం అవసరం అవుతుందో అంతే తినాలి. కానీ ఆహారాన్ని తగ్గించకూడదు.
2. కొందరు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేస్తే బరువు ఎక్కువగా తగ్గవచ్చని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తే రోజులో మిగిలిన సమయాల్లో అధికంగా ఆహారాన్ని తింటారు. దీని వల్ల బరువు తగ్గకపోగా, పెరుగుతారు. అవును, ఇది నిజమే. పలు అధ్యయనాలు కూడా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కనుక ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పనిసరిగా చేయాలి.
3. కొవ్వు పదార్థాలను తింటే బరువు అధికంగా పెరుగుతారని చెప్పి కొందరు వాటిని తినరు. నిజానికి అన్ని రకాల కొవ్వులు అలా కాదు. కొన్ని కొవ్వు పదార్థాలు మన బరువును తగ్గిస్తాయి. నెయ్యి, ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె తదితర నూనెలు బరువు తగ్గించడానికి ఉపయోగపడతాయి. కనుక వీటిని రోజువారీ ఆహారంలో మితంగా తీసుకుంటే మంచిది. త్వరగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
4. నేటి తరుణంలో ఎక్కడ చూసినా కొన్ని ప్యాక్ చేయబడిన ఆహారాలపై డైట్ అని ఎక్కువగా మనకు కనిపిస్తున్నది. డైట్ కూల్ డ్రింక్స్ ఇదే కోవకు చెందుతాయి. నిజానికి వీటి వల్ల క్యాలరీలు రాకపోయినా వీటిల్లో కలిపే ప్రిజర్వేటివ్స్, చక్కెర, సోడియం సంబంధ పదార్థాలు మన శరీరానికి హాని చేస్తాయి. అధిక బరువు తగ్గాలనుకునే వారు ఇలాంటి డైట్ ఫుడ్స్‌ను తీసుకోకపోవడమే ఉత్తమం.
5. అధిక బరువు తగ్గాలనుకునే వారు మద్యం సేవించడం మానేయాలి. మద్యం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు శరీరంలో పెరిగి అధికంగా బరువు పెరుగుతారు. కనుక మద్యం తీసుకోవడం మానేస్తే బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.
6. బరువు అధికంగా, వేగంగా తగ్గవచ్చని కొందరు అప్పుడప్పుడు తిండి తినడం మానేస్తారు. ఇలా చేయరాదు. శరీరానికి రోజువారీ అవసరం అయ్యే శక్తిని ఇవ్వడం కోసం మనం రోజూ నిర్దిష్టమైన పరిమాణంలో ఆహారాన్ని తీసుకోవాలి. అలా తీసుకోకపోతే అది శరీర మెటబాలిజంపై ప్రభావాన్ని చూపుతుంది. తరువాతి సమయాల్లో అధిక ఆహారం తీసుకునేలా చేస్తుంది. కనుక తిండి తినడం మానేయరాదు. వేళకు పోషకాలతో కూడిన పౌష్టికాహారాన్ని తినాలి.
7. వీలైనంత వరకు జంక్ ఫుడ్స్ తినడం మానేయాలి. ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇచ్చే ఆహారాలను రోజూ తినాలి. తాజా, సీజనల్ పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, నట్స్, చేపలు, పాలు తదితర ఆహారాలను తీసుకుంటే శరీరానికి సంపూర్ణ పోషణ అందుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.