తినగ.. తినగ వేము తీయనుండు అంటారు కదా..! అలాగే, చూస్తూ.. చూస్తూ పోతే ప్రతీ హీరోకు ఓ టైమ్ వస్తోంది. ఇతనా..! హీరోనా..? అన్న వాళ్లు కూడా స్టార్స్ అయ్యారు. ఇదే దారిలో ఇప్పుడు సుధీర్‌బాబు కూడా వెళ్తున్నాడు. ఈయన కూడా తన ఒక్కో సినిమాతో తన మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. తాజాగా, నన్నుదోచుకుందువటే అనే టైటిల్‌తో వస్తున్నాడు. మరి, ఈ సినిమా సుధీర్ మార్కెట్‌ను పెంచేస్తుందా..?
సూపర్‌స్టార్ కృష్ణ అల్లుడిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ ఎప్పుడు పెద్దగావాళ్లను వాడుకోలేదు సుధీర్‌బాబు. సొంతంగానే ఎదగడానికి ఒక్కో ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలోనే ఈ హీరో జాతకం మారుతూ వస్తోంది. ప్రేమథాచిత్రమ్ సినిమాతో తొలి విజయం అందుకున్న సుధీర్‌బాబు భలే మంచి రోజు, శమంతకమణితో గుర్తింపు తెచ్చుకున్నాడు. సమ్మోహనంతో మరో విజయాన్ని తనఖాతాలో వేసుకున్నాడు సుధీర్‌బాబు.
సమ్మోహనం చిత్రం విడుదలై నెలకూడా గడవకముందే.. మరో చిత్రంలో వచ్చేందుకు రెడీ అయిపోయాడు ఈ హీరో. నన్ను దోచుకుందువటే అంటూ పాతపాట టైటిల్‌తో వస్తున్నాడు. సుధీర్ బాబు సొంత ప్రొడక్షన్ హౌస్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. నభానటాషా హీరోయిన్. ఆర్.ఎస్ నాయుడు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.
సాఫ్ట్‌వేర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈవోగా ఈ సినిమాలో నటిస్తున్నాడు సుధీర్‌బాబు. ఆ ఆఫీసులో ఎంప్లాయిగా హీరోయిన్ ఉంటుంది. ఇద్దరి మధ్యన జరిగే గిల్లికజ్జాలే కథాసారాంశం. అయితే, ఇటీవల విడుదలైన నన్ను దోచుకుందువటే టీజర్ లో కామెడీనే హైలెట్‌గా నిలిచింది. ఆగస్టులో నన్ను దోచుకుందువటే విడుదల కానుంది.