వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటితో 211వ రోజుకు చేరుకుంది. జగన్ చేస్తున్న పాదయాత్ర సామాన్యులనే కాదు సెలబ్రెటీలను కూడా ఆకర్షిస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం సామాన్యమైన విషయం కాదని, అందుకు గట్టి పట్టుదల ఎన్ని కష్టాలనైనా ఎదుర్కొనే ధీరత్వం ఉండాలంటున్నారు. వైఎస్ జగన్ ఓపికకు, సహనానికి, పోరాట పటిమకు సెలబ్రెటీలు హ్యాట్సాఫ్ అంటూ ఇటీవల కాలంలో కోలీవుడ్ హీరోలు సూర్య, విశాల్, టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ ఇంకా పలువురు సినీఇండస్ట్రీ ప్రముఖులు మీడియా ముఖంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇలా ఒక్కొక్కరుగా సెలబ్రెటీలతోపాటు సీనియర్ రాజకీయ నాయకులు సైతం వైఎస్ జగన్‌కు జై కొడుతున్నారు.
ఇదిలా ఉండగా, జగన్ చేస్తున్న పాదయాత్ర నేపథ్యంలో ఇటీవల కాలంలో ఏపీలో పలు సంస్థల ఏజెన్సీలు చేసిన ఎన్నికల సర్వేల్లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. అలా వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడటానికి కారణాలు లేకపోలేదని, చంద్రబాబు సర్కార్ చేస్తున్న అవినీతి, మహిళలపై దాడులు, సామాన్యుల అభివృద్ధిని చంద్రబాబు సర్కార్ పట్టించుకోకపోవడమే.. టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లోవ్యతిరేకతను పెంచిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికల సర్వే సంస్థల ఫలితాలను దృష్టిలో పెట్టుకున్న పలు రాజకీయ పార్టీల నేతలు సాధారణ ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో..పార్టీలు మారే ఆలోచనలో ఉన్నారని, ఈ క్రమంలోనే వైసీపీలోకి ఇటీవల కాలంలో వలసలు పెరిగిన విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
అయితే, ఉభయ గోదావరి జిల్లాల్లో మొన్నటి వరకు ఏకపక్షంగా సాగిన రాజకీయాలు జగన్ ప్రజా సంకల్ప యాత్రతో ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నాయి. ఇటీవల చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వ కాకినాడ వేదికగా నిర్వహించిన ధర్మపోరాట దీక్షనే ఇందుకు నిదర్శనమని, చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత కారణంగా ఆ సభలో పాల్గొనేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపలేదని ఆ జిల్లాల ప్రజలే బాహాటంగా చెబుతున్నారు. అంతేకాకుండా, నాలుగేళ్లపాటు కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించి.. టీడీపీపై ప్రజల వ్యతిరేక పెరుగుతున్నక్రమంలో వారిచేత రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. అయితే, కేంద్ర మంత్రి పదువులు అనుభవించినప్పుడు గుర్తుకు రాని ప్రత్యేక హోదా అంశం.. రాజీనామా చేసిన తరువాత గుర్తుకు వచ్చిందా..? అంటూ టీడీపీ సర్కార్‌ను, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలా గోదావరి జిల్లాల ప్రజల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ క్రమంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో టీడీపీ కీలక నేతలుగా ఉన్న తోట త్రిమూర్తులు టీడీపీనీ వీడి వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని, ఈ నేపథ్యంలోనే అధికార టీడీపీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా, ఆ పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తూర్పు గోదావరి జిల్లాల్లో వైఎస్ జగన్ మరికొద్ది రోజుల్లో తన ప్రజా సంకల్ప యాత్రను ముగించుకోనున్న విషయం తెలిసిందే. పాదయాత్ర తూర్పుగోదావరిలో పూర్తయ్యేలోగా ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారంటూ ఓ సోషల్ మీడియా కథనం పేర్కొంది.