తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని దేవాలయాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తెలంగాణ తిరుపతిగా పేరు పొందిన యాదాద్రి ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది. యాదగిరి లక్ష్మీనర్సింహ స్వామి కొలువుదీరిన ఈ ఆలయానికి ISO సర్టిఫికెట్ లభించింది.యాదాద్రి పుణ్యక్షేత్రం ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించినందుకు ఆలయ అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. ఐటిడిఎ వైస్ చైర్మన్ జి.కిషన్ రావు, ఇవో ఎన్.గీత, హెచ్.వై.ఎం. ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకుడు అలపాటి శివయ్య తదితరులు శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రిని కలిశారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి డిజిటలైజ్ చేసిన నమూనాను, ఐఎస్ఓ వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. దేవాలయాన్ని అద్వితీయంగా నిర్వహించడంతో పాటు ఆలయంలో పర్యావరణ పరిరక్షణ, భద్రత, నిర్వహణ, విద్యుత్ సరఫరా విభాగాల్లో మెరుగైన సేవలు అందిస్తున్నందుకు యాదాద్రి ఐఎస్ఓ సర్టిఫికెట్ సాధించింది. భారతదేశంలో ఓ ఆలయానికి ఐఎస్ఓ సర్టిఫికెట్ ఇదే ప్రథమం.