ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా వలసలు జరుగుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ నేతలు, కాంగ్రెస్స్ , పారీశ్రామిక వేత్తలు మొదలగు వారు ప్రధాన ప్రతి పక్షం వైసీపీలో చేరుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మాజీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు వైసీపీలో చేరారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ సమక్షంలో శుక్రవారం ఆయన ఆ పార్టీ తీర్థం పుచుకున్నారు. మోహన్ బాబుకు జగన్ పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మన పార్టీకి మంచి రోజులు రాబోతున్నాయని, అందుకోసం మీరు కష్టపడి పని చేయండి అని నేతలకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మోహన్ అనుచరులైన మాజీ కౌన్సిలర్ సురేష్, నాయీబ్రాహ్మణ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రావూరి లక్ష్మయ్య, టీడీపీ ఒంగోలు నగర ఉపాధ్యక్షుడు రాజేష్ తదితరులు కూడా వైసీపీలో చేరారు. వారికి ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈదర మోహన్ మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ స్వార్ధ పూరిత రాజకీయాలతో జిల్లాలో సహకార వ్యవస్ధను దెబ్బతీశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బాలినేని గెలుపే తమ లక్ష్యమని ప్రకటించారు.