ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం సాధ్యమవుతుందని వైసీపీ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. శుక్రవారం కర్నూల్ జూపాడుబంగ్లా మండలంలోని తంగడంచ గ్రామంలో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు సిద్ధార్థరెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ అభివృద్ధికోసం అహర్నిశలు కృషిచేస్తానన్నారు. తనకు ఎవరితో శత్రుత్వం లేదని పార్టీలోకి ఎవరు చేరినా వారిని కలుపుకొని పోవడంతో పాటు వారి సలహాలు, సూచనలు పాటిస్తూ పార్టీ బలోపేతానికి దోహదపడతానన్నారు.
తాను ఎలాంటి పదవులు ఆశించి పార్టీలోకి రాలేదని వైఎస్ జగన్ సిద్దాంతాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుపున ఎవ్వరు ఎమ్మెల్యేగా ఉన్నా వారి గెలుపుకోసం శక్తివంచనలేకుండా కృషిచేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు వైసీపీని గెలిపించాలని కోరారు. జగన్ సీఎం అయితేనే బడుగు, బలహీన వర్గాలతోపాటు పేద ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో వైసీపీ పార్టీ కార్యకర్తలు రవి, దినేష్, రోశన్న, సురేష్, సంజీవ, అయ్యన్న, తిక్కన్న, స్వామి, మహేశ్వర, అంజి, కిషోర్, శేషన్న, మస్తాన్, లింగన్న పాల్గొన్నారు.