నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన సవాల్ విసిరారు. ఈనెల 27న దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతిని పురస్కరించుకొని ఇగ్నైటింగ్స్ మైండ్స్, వాక్ ఫర్ వాటర్ స్వచ్ఛంద సంస్థలు తెలంగాణ హరితహారం లో భాగంగా ఈ గ్రీన్ చాలెంజ్ కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నాయి. హరితహారం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఛాలెంజ్ లో భాగంగా ఎంపీ కవిత పేరును నామినేట్ చేస్తూ..గ్రీన్ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. చాలెంజ్ ను స్వీకరించిన కవిత ఇవాళ మూడు మొక్కలు నాటి, మరో నలుగురికి చాలెంజ్ విసిరారు.
శనివారం హైదరాబాద్ లోని తన ఇంటి ముందు ఎంపీ కవిత గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మూడు మొక్కలు నాటారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళిలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. తాము చాలెంజ్ ను స్వీకరిస్తున్నామని, మొక్కలు నాటుతామని వారు ప్రకటించారు. మహమూద్ అలీ, రాధాకృష్ణ, రాజమౌళి, సైనా నెహ్వాల్ వీరు ఒక్కొక్కరు మూడు మొక్కల చొప్పున నాటాల్సి ఉంటుంది. మొక్కలు నాటే కార్యక్రమం పోటీతత్వంతో సాగేలా చేయడం చాలెంజ్ కార్యక్రమం ఉద్దేశ్యం. విరివిగా మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యం పెరిగి స్వచ్ఛ ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది..తద్వారా భూతాపం పెరగడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడం, అతివృష్టి లేదంటే అనావృష్టి, వాతావరణ మార్పులు వంటి సమస్యల నుంచి బయటపడవచ్చనే విషయాన్ని అందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఎంపి కవిత అన్నారు.
భవిష్యత్ తరాలకు మేలు చేసేందుకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవాలని ఆమె కోరారు. గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం ఇతరులకు స్ఫూర్తిని ఇస్తుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత వివరించారు. మొక్కలు నాటడమే కాదు..ఆ మొక్కల సంరక్షణ బాధ్యత కూడా తీసుకోవాలని ఎంపి కవిత కోరారు.