త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వస్తుందన్న భయంతో, ప్రజలను భమ్యపెట్టి, సానుభూతి పొంది ఎలాగైనా 2019 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది, మళ్లీ అధికారంలోకి రావాలన్న తలంపుతోనే ఏపీ అధికార టీడీపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. 2016 సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో ఏపీ సీఎం చంద్రబాబు చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ఆ వ్యక్తి నవ్వులు పూయించాడు. ఏపీకి ప్రత్యేక హోదా వద్దు.. ప్రత్యేక ప్యాకేజీ చాలని చంద్రబాబు నాతో అన్నారు.
ఇంతకీ ఈ మాటలు చెప్పిన వ్యక్తి ఎవరు..? ఏ సందర్భంలో అన్నారు..? సీఎం చంద్రబాబు 2016 సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో ఏమని చెప్పారు..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
ఇక అసలు విషయానికొస్తే, శుక్రవారం నాడు ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మరోసారి లోక్ సభ దద్దరిల్లిన విషయం తెలిసిందే. నాలుగేళ్లపాటు బీజేపీతో కలిసి అటు కేంద్ర ప్రభుత్వంతోపాటు.. ఇటు రాష్ట్ర ప్రభుత్వంలోనూ అధికారం పంచుకున్న టీడీపీ అవిశ్వాస తీర్మానం పెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ శుక్రవారం నాడు చర్చకు ఆహ్వానించగా.. ప్రత్యేక హోదా ఇవ్వాలా…? వద్దా..? అన్న అంశంపై వాదోపవాదాలు వాడీవేడిగా జరిగాయి.
అయితే, శుక్రవారం జరిగిన లోక్‌సభ చివర్లో ప్రధాని మోడీ మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కంటే కూడా.. మేలైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలని ఓ టీడీపీ సభ్యుడు (పేరు చెప్పలేదు) చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. ఆ వ్యక్తి ప్రస్తుతం సభలో కూడా ఉన్నాడు. అందుకు సంబంధించి వారి అనుకూల మీడియాలో ప్రకటనలు కూడా ఇప్పించుకున్నారంటూ ప్రధాని మోడీ చెప్పారు. ఆ టీడీపీ ఎంపీ చెప్పిన మాట ప్రకారం.. ఏపీ సీఎం చంద్రబాబును తుది నిర్ణయం కోరాం. సీఎం చంద్రబాబు కూడా ఆ అంశానికే మొగ్గు చూపడంతో..వారి కోరిక మేరకే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని లోక్‌సభ సాక్షిగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. 2016 సెప్టెంబర్‌లో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే.. 2016 నవంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ చంద్రబాబు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయాన్ని మోడీ గుర్తు చేశారు.