ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ బంద్.. ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ మునుపటికంటే ఉద్యమాలను తీవ్రతరం చేయనుంది. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 24న (మంగళవారం) ఏపీ వ్యాప్తంగా బంద్కు పిలుపునిస్తూ ప్రకటన జారీచేసింది. ఈ అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఇవాళ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న బంద్కు అన్ని పార్టీలతోపాటు.. అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఇప్పటికే పదువులు వీడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు తోడుగా టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేయాలని, అలా చేస్తే కేంద్ర దృష్టి రాష్ట్రంపై పడుతుందని వైఎస్ జగన్ అన్నారు. అప్పుడే దేశంలోని అన్ని పార్టీలు ఏపీకి జరిగిన అన్యాయంపై చర్చిస్తాయన్నారు. ఏపీకి చెందినెంపీలందరూ ఒక్కతాటిపై నిలిచి పోరాడితే కేంద్రం ఎందుకు దిగిరాదో అప్పుడు చూద్దామని, ప్రత్యేక హోదా డిమాండ్ ఎంత బలంగా ఉందో మిగిలిన పార్టీలకు అప్పుడు తెలిసొస్తుందన్నారు వైఎస్ జగన్.