ప్రజా సమస్యలపై పోరాటంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. తమ సమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేస్తున్న జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ప్రతీ ఒక్కరు జగన్‌ను ప్రత్యక్షంగా కలుసుకుని వారి సమస్యలను తెలుకుంటున్నారు. మరికొందరు చంద్రబాబు సర్కార్ వల్ల తాము ఎదుర్కొంటున్న సమస్యలను అర్జీల రూపంలో జగన్‌కు చెబుతున్నారు. వైఎస్ జగన్ వారి సమస్యలను ఎంతో ఓపికతో వింటూ.. పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ ప్రజా సంకల్ప యాత్రతో ముందుకు కదులుతున్నారు.
ఇదిలా ఉండగా, మంగళవారం ఓ ప్రముఖ ఛానెల్‌కు వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా కేంద్రంలో జరిగిన ఓ హృదయ విదారకర సంఘటనను గుర్తు చేశారు. ఆ సంఘటన గురించి జగన్ మాటల్లో ఇలా…
నెల్లూరులో నా పాదయాత్ర కొనసాగుతుందని తెలుసుకున్నగోపాల్ అనే వ్యక్తి, అతని భార్య నన్ను కలుసుకునేందుకు పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ సమయంలో వారి కళ్లల్లో నీళ్లు.. ముఖంపై బాధ కనిపించింది. అంతకు ముందే గోపాలన్న ఇంటి ముందు ఓ ఫ్లెక్సీలోని ఫోటోకు దండ వేసి ఉండటాన్ని గమనించా. ఏమైంది గోపాలన్నా అని అడిగా. అన్నా ఆ ఫ్లెక్సీలో ఉన్నది నా పెద్ద కుమారుడు. చిన్నప్పట్నుంచి బాగా చదివించా.. ఇంటర్మీడియట్‌లో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. దాంతో ఇంజినీరింగ్ చదివించాలని ఆశపడ్డాడు. ఆ ఆశే నా కుమారుడి ప్రాణం తీసింది.
ఇంజినీరింగ్‌కు చదువుకు సుమారు ఏడాదికి లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. చంద్రాబు సర్కార్ ఇచ్చేఫీజు రీయంబర్స్‌మెంట్ చూస్తేనేమో రూ.35వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో నా కుమారుడికి భయపడకు..ఏదో ఒకటి చేసి.. నీ చదువుకు డబ్బు పంపుతా అని చెప్పి ఇంజినీరింగ్‌లో చేర్పించా. ఇలా ప్రతీ సంవత్సరం అప్పులు చేసైనా నా కుమారుడిని చదివస్తూ వచ్చా. అయితే, నేను అప్పులు చేసి చదివిస్తున్నానని తెలుసుకున్న నా కుమారుడు చివరకు ఆత్మహత్య చేసుకున్నాడు అంటూ తన వద్ద బోరున విలపించిన ఘటనను జగన్ గుర్తు చేశారు.
అలాగే, తన రెండో కుమారుడ్ని చూపించి.. మా చిన్నబ్బాయి కూడా బాగా చదువుతున్నాడన్నా.. వీడు ఇంజినీరింగ్ కి వచ్చేలోపు.. నీవు ముఖ్యమంత్రి అవుతావన్నా..చంద్రబాబు సర్కార్‌లాగా.. మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తావన్న నమ్మకం మాకు ఉందన్నా.. అని అంటూ గోపాల్ తనతో చెప్పిన మాటలను జగన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.