తాము చేస్తే సంసారం…ఎదుటోళ్లు చేస్తే.. అన్న సామెతకు సరిగ్గా సరిపోయే తెలుగుదేశం నేతలు ప్రచారానికి పెట్టింది పేరనే సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు కలిసి ఉన్న సమయంలో ఏనాడూ ఏపీ ప్రయోజనాలు పట్టించుకోని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పైపెచ్చు ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అవిశ్వాసం పెడితే కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు తగదునమ్మా అంటూ అవిశ్వాసం పెట్టి రంకెలు వేస్తున్నాడు. పైగా ఇందులో కి తన వందిమాగదులతో తెలంగాణ రాష్ట్ర సమితిని లాగుతున్నాడు. తమకు మద్దతు ఇవ్వకపోవడం పెద్ద తప్పిదం అన్నట్లుగా ఆయన ప్రచారం చేపిస్తున్నాడు.
అయితే, కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు పెట్టిన అవిశ్వాసానికి తెలంగాణ సీఎం కేసీఆర్ మద్దతు ఇవ్వకపోవడం వెనుక తెలంగాణ ప్రజల ప్రయోజనాలే ప్రధాన అంశమని రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో పాటుగా చంద్రబాబు కుట్ర రీతిని గులాబీదళపతి ముందే పసిగట్టారని చెప్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మద్దతు ఇస్తే వచ్చే తక్షణ ప్రయోజనాలు ఏమిలేకపోగా, ప్రత్యేక హోదా వస్తే తెలంగాణలోని ఫ్యాక్టరీలు ఏపీకి తరలిపోయే అవకాశాలు ఉన్నాయనేది పలువురి అంచనా. దీంతోపాటుగా ప్రత్యేక హోదాతో ఏపీకి సమకూరే ప్రత్యేక పన్ను మరియి ఇతర రాయితీలతో కొత్త పరిశ్రమలు ఏపీనే ఎన్నుకునే అవకాశాలు ఎక్కువ. కొత్త పరిశ్రమలు, ఇక్కడ ఇప్పటికే ఉన్న పరిశ్రమలు ఏపీకి పోతే కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ఆర్ధికంగా పెద్ద నష్టమే అవుతుందని అందుకే సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని చెప్తున్నారు.
పైగా చంద్రబాబు చేస్తున్న కుట్రల గురించి ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడు మండలాలతో పాటు లోయర్ సీలేరు విద్యుత్ ప్రాజెక్టును నొక్కేయడం, తెలంగాణ వరఫ్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసులు వేయడం వంటి కుట్రలను ప్రజలు ఇంకా గమనిస్తున్నారని వివరిస్తున్నారు. ఇలా కుట్రలు చేస్తున్నందుకా చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.