మల్టిప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో ప్యాకేజ్డ్ వస్తువులపై వినియోగదారుల నుంచి ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేయడానికి వీలులేదని, పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని తూనికల కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేసింది. దీనిపై మంగళవారం నాడు పౌరసరఫరాల భవన్లో సినిమాహాల్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలు తూనికల కొలతల శాఖ కంట్రోలర్ శ్రీ అకున్ సబర్వాల్‌తో సమావేశం అయ్యారు
ఈ సమావేశంలో పీవీఆర్, ఐనాక్స్, ప్రసాద్, ఏషియన్, సినీ పోలీస్, టివోలీ మల్టీప్లెక్స్‌లతో పాటు సుదర్శన్, శ్రీమయూరి, వెంకటాద్రి, కోణార్క్‌తో పాటు దాదాపు వంద మంది హాజరయ్యారు. తూనికల కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు. థియేటర్స్ క్యాంటీన్ అసోసియేషన్ సెక్రటరీ చంద్రమోహన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజర్ విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంట్రోలర్ మాట్లాడుతూ బహిరంగ మార్కెట్లో ఎంఆర్పీ ప్రకారం ఏ విధంగా అయితే వస్తువులను విక్రయిస్తారో అదే విధంగా సినిమాల హాళ్లు, మల్టిప్లెక్స్‌లలో కూడా విక్రయించాలని ఆదేశించారు. ఎంఆర్పి కంటే ఒక్క పైసా కూడా అధికంగా వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. ప్యాకేజీలో లేని వినిమయ వస్తువులు – పాప్‌కార్న్, ఐస్‌క్రీమ్ వంటి వాటిని స్మాల్, మీడియం, బిగ్, జంబో పేరుతో విక్రయించడం చట్ట విరుద్ధం. ప్రతి దానిపై బరువు, పరిమాణం కచ్చితంగా కనిపించాలి. అలాగే బోర్డుపై కూడా స్పష్టంగా కనిపించేలా ఉండాలని ఆదేశించారు. వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలని, ఇది ప్రతి మల్టిప్లెక్స్, సినిమా థియేటర్ల బాధ్యత అని ఆయన తేల్చిచెప్పారు.
ఈ నెల 24వ తేదీ వరకు ధర, పరిమాణం సంబంధించి స్టిక్కర్ అంటించుకోవడానికి అనుమతించడం జరిగిందని, సెప్టెంబర్ 1వ తేదీ నుండి ఖచ్చితంగా ధరలను ముద్రించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులు నమోదు చేయడమే కాకుండా అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చారించారు. ఈ నెల 24వ తేదీ వరకు నిబంధనలకు విరుద్ధంగా వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్ 180042500333, వాట్సప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయవచ్చునని వినియోగదారులకు కంట్రోలర్ విజ్ఞప్తి చేశారు.