అమెరికాలో నివసిస్తున్న భారతీయ ఉద్యోగుల కోసం వైఎస్ఆర్‌సీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి గలం విప్పారు. ప్రవాస భారతీయులకు సామాజిక భద్రత కల్పన కోసం ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై అమెరికాలో పని చేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ కింద ఏటా బిలియన్ డాలర్లు చెల్లిస్తున్నప్పటికీ వారు సోషల్ సెక్యూరిటీ ప్రయోజనాలు పొందడానికి అనర్హులవుతున్న విషయం వాస్తవం కాదా, ఈ వివక్షను సరిదిద్దడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది…అంటూ వి.విజయసాయి రెడ్డి అడిగారు.
ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సీ.ఆర్. చౌధరి రాజ్యసభలో వివరణ ఇచ్చారు. హెచ్1బీ వీసాలపై అమెరికాలో పని చేస్తున్న లక్షలాది మంది ప్రవాసీ భారతీయులకు సామాజిక భద్రత కల్పించే అంశంపై అమెరికా ద్వంద విధానం అవలంబిస్తున్నట్లు వివరించారు. “భారతీయులతో సహా ప్రవాసీ ఉద్యోగులు ఎవరైనా 40 క్వార్టర్లు లేదా 10 ఏళ్ళు పూర్తిగా సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ చెల్లించిన తర్వాత మాత్రమే వాటి ప్రయోజనాలు పొందడానికి అర్హులు అన్నది అమెరికా ప్రభుత్వ విధానం. అయితే హెచ్-1బీ, ఎల్-1 వీసాలపై పనిచేసే ప్రవాసీలు అమెరికాలో గరిష్టంగా 7 ఏళ్ళకు మించి నివసించడానికి వీల్లేదన్నది కూడా ఆ ప్రభుత్వం విధానం. ఈ రెండు విధానాల మధ్య ఉన్న వైరుధ్యాల కారణంగా ఆయా వీసాలపై అమెరికాలో పని చేస్తూ సోషల్ సెక్యూరిటీ కంట్రిబ్యూషన్ చెల్లిస్తున్న వారు దాని ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవడానికి అనర్హులు` అని మంత్రి తెలిపారు. ఇదే అంశాన్ని అమెరికా ప్రభుత్వంతో మంత్రిత్వ స్థాయి చర్చలలో అనేక మార్లు లేవనెత్తి సానుకూలంగా పరిష్కరించాలని కోరినప్పటికీ చట్టం అంగీకరించదంటూ అమెరికా వాదిస్తోందని మంత్రి తెలిపారు.