తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్స్ లో ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గ బీసీ-ఎస్సీ-స్టీ కుల సంఘాలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ “ఇవ్వాళ్టికి కూడా కడు బీదరికంలో, రెక్కల కష్టం మీద బ్రతికే వారు ఎవరు అంటే ఎస్సీ, ఎస్టీలు వారు మాత్రమే. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల విషయంలో కూడా దళితులకే మొదటి ప్రాధాన్యత. గ్రామాల్లో ఎక్కడ అయ్యితే భూమి అమ్మేది ఉన్నదో ఆ భూమిని కొని కడు పేదరికంలో ఉన్న దళితులకు మూడు ఎకరాల భూమి మేమే కొని ఇస్తాం. 95 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు,100 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్, గ్రినరీ లాంటివి కూడా దళితులకు ఇస్తాం.“ అని వెల్లడించారు.
గ్రామంలో ఉన్న పేదవారు ఎవరు అయితే ఉన్నారో వారికి ప్రభుత్వం తరపున అయిన, బ్యాంక్ ద్వారా అయిన కానీ ఏదో ఒక రూపంలో సహాయం అందిస్తామని మంత్రి ఈటల హామీ ఇచ్చారు. “గతంలో మమ్ముల్ని ఎవరు పట్టించుకుంటారు అనే ఆలోచనలో ఉన్న మీ అందరికీ నేనే అండ, నేనే మీ లీడర్. ఎవరున్నారు మాకు అనే భావన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత పోయింది. ఒకప్పుడు గొప్పగా బ్రతికిన కులాలు ఈ నాడు చితికి పోయినాయి. వారికి మేము అండగా ఉంటాం. సంచార జాతుల వారు గతంలో గుర్తించబడలేదు కానీ ఈ నాడు వారిని అసెంబ్లీకి పిలిచి స్పీకర్ మధుసూదన చారీ గారి అధ్యక్షతన మీటింగ్ పెట్టీ వారికి అండగా నిలుస్తామని చెప్పిన ప్రభుత్వం మాది. సంచార జాతుల పిల్లలందరికీ రెసిడెన్సీ యల్ స్కూల్ లో సీట్లు ఇప్పిస్తాం.“ అని హామీ ఇచ్చారు.
“సాధారణంగా లోన్లు ఇవ్వాలని మీరు మా దగ్గరికి వస్తారు.. కానీ నేనే మీ దగ్గరికి వచ్చి లోన్లు ఇస్తున్న. గతంలో బ్యాంక్ లింక్ ఉండే ఇప్పుడు ఆ బాధ లేదు నేరుగా మీకే చెక్ అందిస్తాం. కులం ఏదయినా పేదరికం ఎజెండాగా లబ్దిదారులను ఎంపిక చేస్తాం. రెండు ఎకరాల లోపు భూమి ఉన్న వారందరికీ 50 వెలరూపాయలు అందిస్తున్నాం. ఏ అండ లేనివారికి తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది` అని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.