రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రకట చేసింది. కులవృత్తిదారులు సగర్వంగా జీవించేలా ప్రణాళికబద్దంగా కృషిచేస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం ప్రకటించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం క్రింద 1000 కోట్ల వ్యయం చేయనున్నామని, గతంలో ఈ శాఖకు ఇంత పెద్ద ఎత్తున కేటాయింపులు జరగలేదని పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. మత్స్యకారుల కుటుంబాలలో వెలుగులు నింపాలనేదే మన ముఖ్యమంత్రి ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. త్వరలో మత్స్యకారులకు 75 నుండి 100 శాతం సబ్సిడీపై ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రక్ లను అందించనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు.
ఈ సంవత్సరం అన్ని నీటి వనరులలో 80 కోట్ల చేపపిల్లలను విడుదల చేయడం జరుగుతుందని మంత్రి తలసాని తెలిపారు. ఈ నెలాఖరు నుండి చేప పిల్లల పంపిణీ ప్రారంభిస్తామన్నారు. గత సంవత్సరం ప్రయోగాత్మకంగా 11 రిజర్వాయర్లలో కోటి 34 లక్షల ఖర్చుతో రొయ్యల పెంపకం చేపట్టగా 8 కోట్ల ఆదాయం లభించిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం 23 రిజర్వాయర్లలో రొయ్యల పెంపకానికి చర్యలు తీసుకున్నామన్నారు. మత్స్య కారుల ఆర్థికాభివృద్ధి కోసమే ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తున్నామని, గత సంవత్సరం పంపిణీ చేసిన చేపపిల్లల వల్ల 2800 కోట్ల ఆదాయం లభించిందన్నారు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేయుతనిస్తుందని తెలిపారు. గొర్రెలు, చేపల పంపిణీని విమర్శించడం అంటే ఆయా సామాజిక వర్గాలను అవమానించడమేనని మంత్రి స్పష్టం చేశారు.