వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఏపీ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. జన ప్రగతే ధ్యేయంగా.. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైఎస్ జగన్‌కు బాసటగా తామున్నామంటూ ప్రజలు నిరూపించుకుంటున్నారు. అడుగడుగునా వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. అంతేకాకుండా, జగన్ ఇస్తున్న హామీలపై నమ్మకం పెరుగుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
కాగా, మంగళవారం ఓ ప్రముఖ ఛానెల్‌కు వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇంటర్వ్యూలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణం పేరుతో అమరావతిలో భూముల నుంచి గోదావరిలో ఇసుక వరకు దోపిడీ చేస్తున్నారు..? పోలవరం, పట్టిసీమ ఇలా టీడీపీ ప్రభుత్వం అన్ని విధాలా విమర్శలు చేస్తున్నారు కదా..? మీరు (జగన్) అధికారంలోకి వస్తే.. ప్రతీకారం తీర్చుకుంటారా..? అని అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ ఇలా సమాధానం ఇచ్చారు.
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నలకు జగన్ సమాధానం ఇస్తూ.. ఒకరిపై ప్రతీకారం తీర్చుకోవాలన్న గుణం నాలో ఎప్పుడూ లేదు. ఏదన్నాతప్పు జరిగితే ఆ తప్పు మీద విచారణ జరగాలి. తప్పును రిపేర్ చేసే పరిస్థితి రావాలి. మరొకరు అలా తప్పు చేయకుండా చర్యలు తీసుకోవాలి. తప్పులన్నీ సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం. ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రిపేర్ చేయాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంటుంది. అందులో భాగంగానే చంద్రబాబు సర్కార్ చేసిన తప్పులన్నిటినీ రిపేర్ చేస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రజా స్వామ్య వ్యవస్థను ఏ విధంగా పక్కదారి పట్టిస్తారో ప్రజలందరికీ తెలుసు.. ఎంత అవినీతి చేసినా.. తన అనుచరవర్గంతో.. వ్యవస్థను పక్కదారి పట్టించేయగలడు. జగన్ అనే వ్యక్తి అధికారంలోకి వస్తే.. కరప్షన్ అనేదే లేకుండా వైసీపీ చేస్తుందని చెప్పారు.