తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ఎంతో మందికి సాయం చేసిన మంత్రి కేటీఆర్ తాజాగా 7 ఏళ్ల ఓ చిన్నారికి మెరుగైన వైద్యం అందించి తన గొప్ప మనస్సును చాటుకున్నారు.వివరాల్లోకి వెళ్తే..రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన మునిగే దేవేందర్ EGSలో ఫీల్డ్‌అసి స్టెంట్‌గా పనిచేస్తున్నాడు.
ఆయనకు ఓ కూతురు ఉంది.ఆమె పేరు విష్ణుప్రియ(7) .ఆమె గతకొన్ని రోజులుగా వెన్నెముక వ్యాధితో బాధపడుతున్నది. చికిత్స నిమిత్తం దేవేందర్ కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.ఆమె పరిస్థితి గమనించిన వైద్యులు చికిత్సకు రూ.4 లక్షలవరకు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు.వైద్యులు అలా చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఇబ్బందిపడుతుండగా ఈ విషయాన్ని స్థానిక నాయకులు ఏఎంసీ చైర్మన్ సుభాష్ ద్వారా పదిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని యశోదా హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి దవాఖానలో చేర్పించారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించిన వైద్యులు సోమవారం ఉదయం ఆపరేషన్ చేశారు. మంత్రి కేటీఆర్ సహకారంవల్లే తన కూతురికి ఆపరేషన్ జరిగిందని, ఆయన మేలును ఎప్పటికీ మరువలేమని విష్ణుప్రియ తల్లిదండ్రులు దేవేందర్, రేణుక తెలిపారు.