తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రైతులు, రైతు కుటుంబాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సునీత, తన తనయుడి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.
ఆ అర్హత శ్రీరామ్‌కు లేదు
పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. రైతుల మనోభాలను పరిటాల కుటుంబం దెబ్బతీస్తోందన్నారు. రైతు బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారంటూ శ్రీరామ్ వ్యాఖ్యానించటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు.. కర్నాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లారని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా పదవుల్లో ఉంటున్న పరిటాల కుటుంబం ఏం సాధించిందని ప్రశ్నించారు. కరవుపై మాట్లాడే అర్హత పరిటాల శ్రీరామ్‌కు లేదని ఆయన పేర్కొన్నారు.