ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విషయంలో కొత్త ప్రచారం ఊపందుకుంటోంది. ఈయన వైసీపీలోకి చేరనున్నారు అనేది తాజా ప్రచార సారాంశం. ఏపీలో కాంగ్రెస్ పార్టీ కోలుకునే అవకాశాలు ఇప్పుడప్పుడే లేవని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పాగా వేయ్యాలని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిరణ్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ కిరణ్ కుమార్ రెడ్డిను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే నాలుగేళ్లుగా పార్టీ తరఫున రఘువీర యాక్టివ్ గా ఉన్నా సొంత ఖర్చులతో వివిధ కార్యక్రమాలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. ఎందుకంటే ఏపీసీసీ పదవినీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఇదే కష్టం మరో పార్టీలో చేరి పడి ఉంటే దానికి అంతో ఇంతో ప్రయోజనం ఉండేది. ఈ నేపథ్యంలో రఘువీరారెడ్డి వైసీపీ పార్టీలో చేరనున్నారనే మాట వినిపిస్తోంది. అంతేకాదు రఘువీర వైసీపీలో చేరితే హిందూపురం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలున్నట్టు సమాచారం. రఘువీర గొల్ల సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. హిందూపురం పరిధిలో మరీ ఎక్కువ కాకపోయినా ఫర్వాలేదనిపించుకునే స్థాయిలో వీరి జనాభా ఉంటుంది. కాబట్టి హిందూపురం నుంచి పోటీకి తగిన అభ్యర్థే అవుతాడు. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుగుతున్నాయని…జగన్ కు కావాల్సిన వ్యక్తులతో రఘువీర సంప్రదింపులు జరుపుతున్నాడని వార్తలు వస్తున్నాయి. చూడలి మరి ఏం జరుగుతుందో..!