నల్లగొండ మీటింగ్‌లో కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌పై ,ప్రభుత్వంపై నోటికొచ్చిన్నట్టు మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, పి.శేఖర్ రెడ్డి,భాస్కర్ రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలు ఈ సమావేశం ద్వారా తమ నైజాన్ని ,సంస్కృతిని బయట పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దశాబ్దాలుగా కాంగ్రెస్ హాయంలో అంధకారంలో నెట్టబడ్డ నల్లగొండ జిల్లాను 35 వేల కోట్ల రూపాయలకు పైగా నిధులతో టీఆర్ఎస్ సర్కార్ అభివృద్ధి చేస్తున్నందుకా వారికి కడుపుమంట? అని సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ ఖాళీ అవుతున్నందుకు వారు టీఆర్ఎస్‌పై అక్కసు ప్రదర్శిస్తున్నారని వ్యాఖ్యానించారు.టీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో ప్రజలకు వెలుగులు ప్రసాదిస్తున్నందుకు కాంగ్రెస్ నేతలకు అక్కసు.
తెలంగాణ ఉద్యమంలో దొంగలకు ,ఉద్యమ ద్రోహులకు సద్దులు మోసిన చరిత్ర నల్లగొండ కాంగ్రెస్ నేతలది. అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటమా ? …నల్గొండ కాంగ్రెస్ నేతలు తమ ఆస్తుల పై బహిరంగ విచారణకు సిద్ధమా?“ అని ఎమ్మెల్యే వేముల వీరేశం సవాల్ విసిరారు. `కోమటిరెడ్డి బ్రదర్స్ పుట్టింది అవినీతిలో…బతుకుతోంది అవినీతిలోనే. కోమటిరెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ఫ్రా కు కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో అయాచితంగా దోచి పెట్టారు. మరింత డబ్బును రిఫండ్ చేసుకునేందుకు 2016 లో సుశీ ఇన్ఫ్రా ప్రభుత్వం పై కేసు వేసింది.
గతంలో లాగా ప్రభుత్వం సుశీ కంపెనీకి లబ్ది చేకూర్చడం లేదనే కోమటిరెడ్డి కుటుంబానికి సీఎం కేసీఆర్ పై కక్ష. కోమటిరెడ్డి విజయ్ మాల్యా 2 కాబోతున్నారు“ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబాన్ని నవాజ్ షరీఫ్ కుటుంబంతో పోల్చి కోమటిరెడ్డి తన పిచ్చి తనాన్ని చాటుకున్నారని వీరేశం స్పష్టం చేశారు. “గత ఎన్నికలప్పుడు ఉత్తమ్ మూడు కోట్ల రూపాయలు డబ్బులు దొరికితే వాటిని కాల్చలేదా? 2019 ఎన్నికలే నల్గొండ కాంగ్రెస్ నేతలకు చివరి ఎన్నికలు. ప్రజలు కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెట్టబోతున్నారు. సంచలనాల కోసం మీడియా లో ఉండేందుకు కాంగ్రెస్ నేతలు అనవసర విషయాలు మాట్లాడుతున్నారు. కోమటిరెడ్డి అవినీతిని ఆధారాలతో సహా నిరూపిస్తాం. కాంగ్రెస్ నేతలు నోరును అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు“ అని ఆయన స్పష్టం చేశారు.