గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహం లభ్యం ఐ.పోలవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల్లంక వద్ద గోదావరిలో పడవ బోల్తా పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని సహాయబృందాలు కనుగొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థినులతో పాటు ఓ మహిళ గల్లంతయ్యారు.
ఆదివారం మహిళ మృతదేహం వెలికితీయగా.. ఈరోజు మధ్యాహ్నం గోగుల్లంకలో ఓ విద్యార్థిని మృతదేహాన్ని కనుగొన్నారు. దీంతో మిగిలిన ఐదుగురు విద్యార్థినుల మృతదేహాల కోసం సహాయ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈరోజు సాయంత్రం నాటికి అందరి మృతదేహాలు వెలికితీస్తామని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
వర్షం తగ్గుముఖం పట్టడంతో ఎన్డీఆర్‌ఎఫ్, నేవీ సహా సహాయబృందాలు గాలింపు ముమ్మరంగా చేపట్టాయి.బోట్లు, హెలికాప్టర్ల సాయంతో గోదావరిలో గాలిస్తున్నారు. చినరాజప్ప, కలెక్టర్ కార్తకేయ మిశ్రా తదితరులు సహాయచర్యలు పర్యవేక్షిస్తున్నారు.