నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నిర్ణయాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రశంసించారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజనం పెట్టాలనే ఆలోచన అభినందనీయమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు. జిల్లాకేంద్ర గ్రంథాలయంలో ఉచిత భోజన సేవలను ఎంపీ కవిత మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో కలిసి ఆదివారం ప్రారంభించారు. విద్యార్థినీ విద్యార్థులకు మంత్రి తుమ్మల, ఎంపీ కవిత భోజనం వడ్డించారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బంధువులకు ఉచితంగా భోజనం పెట్టే కార్యక్రమాన్ని తన స్వంత ఖర్చులతో ప్రారంభించిన ఎంపీ కవిత ఆ తర్వాత బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రారంభించారు. ఇటీవలే ఆర్మూర్ లో కూడా ప్రారంభించిన వ్విషయం తెలిసిందే. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్ర గ్రంథాలయం లో జాయింట్ కలెక్టర్ రవీందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రంథాలయాల్లో మధ్యాహ్న పూట భోజనం పెట్టాలన్న ఆలోచన చేసిన ఎంపి కవిత ఆలోచన అభినందనీయమన్నారు. ఇది వినూత్న కార్యక్రమం అన్నారు. గ్రంథాలయాలకు తెలంగాణ పోరాట యోధులు, మహానుభావుల పేర్లు పెడతామన్నారు.