రైతన్నల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దేశంలోనే విప్లవాత్మక నిర్ణయమైన ఈ పథకానికి అనేకవర్గాల నుంచి ఆదరణ దక్కుతోంది. ఇటీవలే ఆర్థికశాఖ సలహాదారు ప్రశంసించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా సీఎం కేసీఆర్ స్పందించారు. ‘‘నేలను విడిచి సాము చేయడం మంచి పద్దతి కాదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. తెలంగాణలో 65 శాతం మంది వ్యవసాయ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నారు. వీరే మనకు ప్రధానం. ఇంత వరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యతారంగంగా చూశారు. అది దురదృష్టకరం“ అని అన్నారు.
“యూరప్, అమెరికా దేశాల్లో రైతుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచడానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కానీ మన దగ్గర, ముఖ్యంగా సమైక్య పాలనలో రైతులు చాలా దారుణంగా వంచించబడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమం కోసం, వ్యవసాయాభివృద్ది కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాము. తెలంగాణలో అమలు చేస్తున్న రైతు బంధు కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఆర్థిక వేత్తలు అభినందిస్తున్నారు. రైతుబంధు పథకాన్ని ఒక మార్గదర్శకంగా అరవింద్ సుబ్రహ్మణ్యం అభివర్ణించారు. వాస్తవిక దృక్పథంతో ఆలోచించబడ్డే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.