కాంగ్రెస్ నాయకుడు, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన ఏడు ఓపెన్ ప్లాట్లను అక్రమంగా విక్రయించినట్లు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ( 2002లో ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సొసైటీలో ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఏడు ఓపెన్ ప్లాట్లను అక్రమంగా రెసిడెన్షియల్ ప్లాట్ల కింద బదిలీ చేసి విక్రయించారని చెప్పారు .
అయితే ఈ వ్యవహారంపై అప్పట్లోనే తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా పట్టించుకోలేదన్నారు. పోలీసుల నిర్లక్ష్యం పై కోర్టును ఆశ్రయించగా విచారణ జరపాలని 2014లో న్యాయమూర్తి ఆదేశించినట్లు అయన చెప్పారు.
రేవంత్‌పై పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో వాకబు చేయగా కేసు తాలూకు డాక్యుమెంట్లు, ఫైళ్లు పాడైపోయినట్టు తెలిసిందన్నారు. ఇందుకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.