ఓ సీఐ తనను భయబ్రాంతులకు గురిచేశాడని మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ జీ.వీరారెడ్డి ఫిర్యాదు చేశారు. వివిధ చానల్స్ లో వస్తున్న కథనాలు అవాస్తవమని, వాటిపైనా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో వీరారెడ్డి కోరారు. తనను బెదిరింపులకు గురిచేయడమే కాకుండా… తిరిగి తనపైనే నిరాధారమైన ఆరోపణలు చేయటం బాధాకరమని వీరారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో తాండూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న కె జనార్దన్ రెడ్డి గత నెల 30 తారీకునుండి నన్ను బెదిరిస్తున్నాడని ఓఎస్డీ వీరారెడ్డి వివరించారు. పంచాయతీ రాజ్ చట్టం సెక్షన్ 264 ప్రకారం ప్రభుత్వం వద్ద అప్పీలు పెండింగులో ఉండగా, అట్టి కేసు క్వాజి జ్యుడిషియల్ విచారణ కొరకు పంచాయతీ రాజ్ మంత్రి విచారణలో ఉండగా, అవాస్తవ ప్రచారం చేస్తున్నాడని వీరారెడ్డి వెల్లడించారు. “జూన్ 30 న మంత్రి గారి విచారణ జరిగిన కేసుపై… అదేరోజు రాత్రి 12 గం లకు పోన్ లో నన్ను బెదిరిస్తూ సీఐ మాట్లాడారు, అదే రాత్రి నాకు బెదిరింపు ఎస్ఎంఎస్‌లు పెట్టాడు. మరల 13.07.2018 నాడు నేను మంత్రి గారి చాంబర్లో అధికారిక విధులలో ఉండగా నాకు పలుసార్లు పోన్ చేయడమే కాకుండా….బెదిరింపు మెసేజ్ లను సీఐ చేశాడు, నన్ను బెదిరిస్తూ మాట్లాడాడు. సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్నాను…. నువ్వు ఏమి ఏమి చేశావో నాకు తెలుసంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. నా సంభాషణ మరియు అవతలి వ్యక్తి బెదిరింపు గమనించిన మంత్రి గారు అతని పేరేంటో తెలుకునే ప్రయత్నం చేస్తే మళ్లీ సీఐ దబాయింపులకు దిగాడు. జుడిషియల్ ప్రొసెస్ లో ఉన్న ఫైలులో త్వరగా ఉత్తర్వులు ఇవ్వాలి అని ఒత్తిడి చేశారు“ అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కొన్ని న్యూస్ చానల్స్ కూడా వాయిస్ లోని కొన్ని భాగాలను కత్తిరించి, కావలసిన మసాలాలు దట్టించి బూటకపు కథనాలను ప్రసారం చేశాయన్నారు. సదరు చానల్స్ పై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో మంత్రి జూపల్లి కృష్ణారావు ఓఎస్డీ వీరారెడ్డి పేర్కొన్నారు.