ఆడబిడ్డలను గౌరవించేందుకు, నేతన్నలకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల కార్యక్రమం పైన టెక్స్‌టైల్ శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు సమీక్ష నిర్వహించారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆ శాఖ అధికారులతో పాటు బతుకమ్మ చీరలు తయారు చేస్తున్న సిరిసిల్ల మాస్టర్ వీవర్లు, మాక్స్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం ఇచ్చిన 90లక్షల బతుకమ్మ చీరల ఆర్డర్ని కచ్చితంగా బతుకమ్మ పండగకు కనీసం వారం రోజులు ముందు సెప్టెంబర్ మాసాంతానికి అందివ్వాల్సిందేనని ఈ సందర్భంగా మంత్రి తెల్చిచేప్పారు. ప్రస్తుతం చీరలను వేస్తున్న వేగాన్ని, లూమ్ లను మరింతగా పెంచి డబుల్ షిఫ్టుల్లో పని చేయాలని కోరారు.
సిరిసిల్లలో ప్రస్తుతం పదివేల లూములపైన చీరల నేత కార్యక్రమం నడుస్తుందని మంత్రికి ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. అయితే నిర్ణీత ఉత్పత్తి లక్ష్యాన్ని అందుకునేందుకు కనీసం 20,000 లూములపైన చీరల ఉత్పత్తి జరగాల్సి ఉందని ఈ మేరకు త్వరలోనే ఉత్పత్తి రెట్టింపు చేస్తామని ఈ సందర్భంగా సిరిసిల్ల మాక్స్ సొసైటీ సంఘ ప్రతినిధులు తెలిపారు.
తెలంగాణ ఆడబిడ్డలకు పండగ సందర్భంగా ఒక చిరు కానుక ఇవ్వాలన్న లక్ష్యంతో పాటు, సిరిసిల్లా లోని నేతన్నలకు ముఖ్యంగా పవర్లూమ్ కార్మికులకు అదాయం పెంచి, వారి జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి చేపట్టారని, ఎంతో నమ్మకంతో సిరిసిల్ల నేత కార్మికులకు ఇచ్చిన బతుకమ్మ చీరల అర్డరును నిలబెట్టుకొని సరైన గడువులోగా వాటిని పూర్తి చేయాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.
చీరల ఉత్పత్తి కార్యక్రమాన్ని పర్యవేక్షించేదుక తన కార్యాలయంతోపాటు శాఖ కమిషనరేట్ నుంచి పర్యవేక్షించాలని, ఈమేరకు వారంలో కనీసం 4సార్లు సిరిసిల్లలో పర్యటించాలని అధికారులను ఆదేశించారు. త్వరలోనే రాష్ట్రంలోని నేతన్నలకు బ్యాంకు రుణాల సదుపాయంతోపాటు, ముద్ర లోన్లు మంజూరీ, ఇతర అంశాలపై చర్చించేందుకు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ తో పాటు బ్యాంకుల ప్రతినిధులు అధికారులతో ఒక సమావేశాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు తెలిపారు.ఈ సందర్భంగా సిరిసిల్లాలోని పవర్‌లూమ్ కార్మికులు తయారు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ మంత్రి పరిశీలించారు. వచ్చేవారం తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జౌళీశాఖ మంత్రి స్మ్రితి ఇరానీ కలుస్తానని ఈ సందర్భంగా పవర్‌లూమ్ అప్‌గ్రేడేషన్ పథకంలో ఎదురవుతున్న సమస్యలను, సవాళ్ళను అమె దృష్టికి తీసుకెళ్తానని మంత్రి ఈ సందర్భంగా సిరిసిల్ల నేతలకు హామీ ఇచ్చారు.
Tags chenetha it minister kcr ktr telanganacm telanganacmo trs