ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయిన నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి తనను సీఎం చేసిన కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా విమర్శించి…ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సొంత పార్టీ పెట్టుకొని ఒక్క అభ్యర్థి కూడా డిపాజిట్ పొందలేనంత ఘోర పరాజయం ఎదుర్కున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన తాజాగా ఎక్కడ అవకాశాలు లేకపోవడంతో తిరిగి తాను విమర్శించిన కాంగ్రెస్ పార్టీలోనే చేరిన సంగతి తెలిసిన విషయమే. ఈ చేరిక సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌ను ప్రధాని చేయడం తన లక్ష్యమన్నారు.
ఈ పరిణామాలు ఇలా ఉంటే..తాజాగా కిరణ్‌కుమార్ రెడ్డిపై సంచలన ఆరోపణలు తెరమీదకు వచ్చాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా భారీ అవినీతికి పాల్పడ్డారి అప్పటి మంత్రి వర్గంలోని నాయకుడు, మాజీ కాంగ్రెస్ నేత, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. ఓ టీవీ చానల్ లైవ్ డిబేట్లో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు, అవినీతిపరుడు, ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని దోచుకున్న వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 10వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతిపై గతంలోనే తాను గవర్నర్ నరసింహన్ కి పిర్యాదు చేస్తే 10వేల కోట్లు కాదు 3వేల కోట్లు చేశాడని గవర్నర్ స్వయానా నాతో అన్నారని డొక్కా కలకలం రేపే కామెంట్లు చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి అవినీతిపై తాను గవర్నర్‌కు, కాంగ్రెస్ అధిష్టానమైన ఏఐసీసీకి రాసిన లేఖలు భయటపెడతానని డొక్కా వెల్లడించారు
కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ కు అదనంగా ఒక్క ఓటు వచ్చిందని డొక్కా మాణిక్యవరప్రసాద్ సెటైర్ వేశారు. కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు. విభజన సమయంలో తల్లి లాంటి కాంగ్రెస్‌ని చంపి, ఇప్పుడు కాపాడుతానని పార్టీ లో చేరడం విడ్డురమని అన్నారు.