వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ ప్రజల సమస్యలపై పోరాటంలో భాగంగా ఏపీ వ్యాప్తంగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, 212వ రోజు పాదయాత్ర చేస్తున్న జగన్‌ను తమ బిడ్డకు అన్నప్రాసన చేయించాలని బిక్కవోలుకు చెందిన తల్లిదండ్రులు కోరారు. వారు అడిగిన వెంటనే వైఎస్ జగన్ స్పందించి.. తన చేతుల మీదుగా ఆ శిశువుకు అన్నప్రాసన చేశారు.
ఈ సందర్భంగా సురేష్ దంపతులు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి మంచి చేయాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ చేతులమీదుగా.. ఏ పని చేసినా మంచే జరుగుతుందన్న నమ్మకం తమకు ఉందన్నారు. వైఎస్ జగన్ ఎంత క్రౌడ్‌లో ఉన్నప్పటికీ.. తనను కలిసేందుకు వచ్చిన వారిని ఎంతో ఓపిగ్గా పలకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ.. తానున్నానన్న భరోసాను ప్రజలకు కల్పిస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారని సురేష్ దంపతులు పేర్కొన్నారు.