ఏ పనైనా.. దానికి ఓ పేరు పెట్టడం.. దాని మాటున విరాళాలు దండుకోవడం పచ్చనేతలకు తెలిసినట్టు మరొకరికి తెలియదంటారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు. గతంలో అమరావతి నిర్మాణం పేరిట హుండీలు, ఇప్పుడు అన్న క్యాంటీన్ల మాటున విరాళాల దందాలే ఇందుకు నిదర్శన మని, గతంలో హుండీ సొమ్ము ఏమైందో ఆ సైకిల్ సార్‌కే తెలియాలని గుసగుసలు ఏపీలో వినిపిస్తున్నాయి. ఇప్పుడు విరాళాల కథకు ఎవరు స్ర్కీన్‌ప్లే, దర్శకత్వమో అర్థం కావడం లేదని తెలుగు తమ్ముళ్లు గొణుక్కుంటున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అన్నక్యాంటీన్లు కాస్తా.. విరాళాల క్యాంటీన్లుగా మారుతున్నాయట. ఎన్నికలకు ముందు.. అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకు మూడుపూటలా నాణ్యమైన భోజనం అందించేందుకు తక్కువ ధరకే రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతున్నా సీఎం చంద్రబాబు అన్న క్యాంటీన్ ఊసే ఎత్తలేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో పేదల ఆకలి కాదు.. ఓట్ల ఆకలి తెలిసి వచ్చినట్టుగా అన్న క్యాంటీన్లు బాబుకు ఉన్న ఫలంగా గుర్తుకు వచ్చాయని విమర్శలు వస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా 203 క్యాంటీన్లు ప్రారంభించాలని నిర్ణయించారట. తొలి విడతగా వాటిలో 60 క్యాంటీన్లను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఒక్కొక్క క్యాంటీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సుమారు కోటి రూపాయలకు పైగా ఇలా 203 క్యాంటీన్లకు 205 కోట్ల రూపాయలు కేటాయించింది. ఒక్కొక్క అన్నక్యాంటీన్ కు కేటాయించిన కోటి రూపాయల్లో నిర్మాణం, గ్రీనరీ, ప్రహరీ పేరిట తెలుగు తమ్ముళ్లు అక్షరాలా అరకోటి రూపాయలు మింగేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలని పిలుపునిస్తున్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాట్లలో చంద్రబాబు కనుసన్నల్లోనే తెలుగు తమ్ముళ్లు ప్రజా ధనాన్ని దోచుకు తినేస్తుననారని విమర్శలు ఉన్న విషయం తెలిసిందే. ఒకవైపు ప్రజా ధనాన్ని తెలుగు తమ్ముళ్లు దోచుకుని తినేస్తూనే అన్న క్యాంటీన్ల నిర్వహణకు డబ్బులు ఇవ్వండని చంద్రబాబు ప్రజలను అడుగుతుండటం పలు విమర్శలకు తావిస్తొంది. అన్న క్యాంటీన్ల పేరుతో దోచేస్తున్నది చాలక.. ఇంకా ప్రజలు ఇచ్చే విరాళాలను కూడా తినేసేందుకు టీడీపీ నేతలు సిద్ధమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సీఎం చంద్రబాబు ప్రజలను చందాలు అడగటం ఇదేమి తొలిసారి కాదని, పలువురు గుర్తు చేస్తున్నారు. గతంలో రాజధాని అమరావతి నిర్మాణం పేరుతో.. మై అమరావతి.. మై రాజధాని పేరుతో చంద్రబాబు ఇటుకల పేరుతో చందాలు వసూలు చేసిన ఉదంతాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. అంతేకాకుండా, హైదరాబాద్ సచివాలయంతోపాటు రాష్ట్రంలో కొన్ని చోట్ల ఏకంగా హుండీలను ఏర్పాటుచేసి అధికారికంగా చందా వసలు చేశారు బాబు అండ్ బ్యాచ్. చివరకు పాఠశాల చిన్నారులను కూడా చంద్రబాబు వదల్లేదు. రాజధాని నిర్మాణం కోసం ఒక్కో విద్యార్థి రూ.10లు ఇవ్వాలని జీవో కూడా ఇప్పించారు. దీనిపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. చంద్రబాబు రాజధాని కోసం అమ్మిన ఇటుకల డబ్బులు, హుండీలో పడ్డ కానుకలు ఏమయ్యాయో పచ్చ తమ్ముళ్లకే తెలియాలని ప్రజలు అంటున్నారు.