తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసి పట్టుకుని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. 365 రోజుల పాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండు కుండల్లా కళకళలాడాలని ముఖ్యమంత్రి చెప్పారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువు పట్టుగా మార్చుకుని తెలంగాణలో సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సిఎం సూచించారు. భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల కాల్వల ద్వారా వచ్చే నీటి ద్వారా, వర్షం ద్వారా వచ్చే నీటి ద్వారా, పడబాటు (రీ జనరేటెడ్) నీళ్ల ద్వారా చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. పరిగెత్తే నీటికి నడక నేర్పాలని సూచించారు. కాల్వలను చెరువులకు అనుసంధానం చేస్తూ మండలాల వారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేయాలని ఆదేశించారు.
‘‘భారీ, మధ్య తరహా నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం’’ అనే కార్యక్రమంపై ప్రగతి భవన్ లో శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రి టి.హరీశ్ రావు, ఎంపిలు కె.కేశవరావు, బి.వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత రెడ్డి, మర్రి జనార్థన్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి, గువ్వల బాలరాజు, దివాకర్ రావు, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, నీటి పారుదల శాఖ ఇఎన్సి మురళీధర్, సిఇలు, ఎస్ఇలు పాల్గొన్నారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజన్సీ, ఇస్రో ద్వారా చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్ పై నీటి పారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
‘‘మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులున్నాయి. 1974లోనే బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణలోని చెరువులకు 265 టిఎంసిల నీళ్లను కేటాయించారు. అంటే అంత పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం కలిగిన గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. కానీ సమైక్య పాలనలో చెరువులు ధ్వంసం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన వెంటనే, మనం మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించుకుని చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టుల ద్వారా తీసుకున్న నీరు ఒక్క చుక్క కూడా వృధా కాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసు కట్టు చెరువులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులున్నాయి. గొలుసుకట్టులో మొదటి చెరువును గుర్తించాలి. ఆ చెరువును ప్రాజెక్టు కాలువకు అనుసంధానం చేయాలి. మొదటి చెరువు నింపుకుంటూ పోతే కింద ఉన్న చెరువులు కూడా నిండుతాయి. దీని కోసం కట్టు కాలువ(ఫీడర్ ఛానల్), పంట కాలువ (క్రాప్ కెనాల్)లను సిద్ధం చేయాలి. ప్రతీ మండల ఎఇ దగ్గర ఆ మండల చెరువులకు సంబంధించిన మ్యాపులు ఉండాలి. ఏ కెనాల్ ద్వారా ఏ చెరువు నింపాలనే దానిపై వ్యూహం ఖరారు చేయాలి. ఏ చెరువు అలుగు పోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టుల కాల్వల నుంచే కాకుండా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్ డ్యాముల ద్వారా, పడబాటు ద్వారా, వర్షం ద్వారా వచ్చే ప్రతీ నీటి బొట్టును చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్త కూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థవంతంగా సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువులు.. ఇలా అన్నింట్లో నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలు కూడా బాగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి’’ అని ముఖ్యమంత్రి వివరించారు.
రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారు చేయాలని, ఏడాదిలోగా అన్ని చెరువులు నింపడానికి అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని, దీనికోసం అవసరమైన నిధులు వెంటనే విడుదల చేస్తామని సిఎం చెప్పారు. వచ్చే ఏడాది జూన్ నుంచి కాళేశ్వరం నుంచ పుష్కలంగా నీళ్లు వస్తాయి కాబట్టి, అలా వచ్చిన నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే ఈ చెరువుల అనుసంధానం పని పూర్తి కావాలని సిఎం చెప్పారు. ఈ పనిని అత్యంత ముఖ్యమైన పనిగా నీటి పారుదల శాఖ గుర్తించాలని కోరారు. చెరువులను, కట్టు కాలువ, పంట కాల్వలను పునరుద్దరించడంతో పాటు అవి కలకాలం బాగుండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఆయకట్టు దారులే కాల్వలు, తూముల మరమ్మత్తులు చేసుకునే వారని, ఎండాకాలంలో చెరువు మట్టిని తోడడం ద్వారా ఎప్పటికప్పుడు పూడిక తీసేవారని చెప్పారు. మళ్లీ ఆ పాతరోజులు రావాలని, దీనికోసం గ్రామాల ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని సిఎం చెప్పారు. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటి పారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
‘‘నీటి పారుదల వ్యవస్థను మెరుగు పర్చడానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల్లో మనకున్నా వాటాను సంపూర్ణంగా వినియోగించుకొవడానికి వీలుగా నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించండి. అక్కడ అవసరమైన లిఫ్టులు, కెనాల్స్, రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమ్మిడి హట్టి బ్యారేజి నిర్మాణం చేపట్టాలి. కడెం కు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గా ఉండే కుప్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలి. దీని ద్వారా కుంటాల జలపాతానికి కూడా నీటి వనరు ఏర్పడుతుంది. కృష్ణాలో కూడా కావాల్సినంత నీరు ఉంది. ఈ నీటిని కూడా సమర్థంగా వినియోగించుకునే వ్యూహం అమలు చేయాలి’’ అని ముఖ్యమంత్రి చెప్పారు.